హైదరాబాద్‌లో మూసీ బీభత్సం.. ఎంజీబీఎస్‌లో చిక్కుకున్న ప్రయాణికులు

  • భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అతలాకుతలం
  • ఉగ్రరూపం దాల్చిన మూసీ నది, ఎంజీబీఎస్‌లోకి వరద
  • బస్టాండ్‌లో చిక్కుకుపోయిన వందలాది మంది ప్రయాణికులు
  • అర్ధరాత్రి పరిస్థితిని సమీక్షించి ఆదేశాలిచ్చిన సీఎం రేవంత్
  • చాదర్‌ఘాట్ వద్ద మూసానగర్‌లో 200 ఇళ్లు నీట మునక
  • లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు
హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి కురిసిన కుండపోత వానకు నగరం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో ఉగ్రరూపం దాల్చిన మూసీ నది, ఎంజీబీఎస్ బస్టాండ్‌ను ముంచెత్తడంతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూసీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఈ వరద నీరు వేగంగా ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి చేరడంతో అక్కడి వారంతా నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయారు. గంటల తరబడి బస్టాండ్‌లోనే ఉండిపోవడంతో మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గండిపేట నుంచి నాగోలు వరకు నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో నగరవాసులు ఆందోళన చెందారు.

ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. అర్ధరాత్రి సమయంలోనే ఆయన ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. బస్టాండ్‌లో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని పోలీస్, జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మూసీ ఉధృతి కేవలం బస్టాండ్‌కే పరిమితం కాలేదు. చాదర్‌ఘాట్ సమీపంలోని మూసానగర్‌లో సుమారు 200 ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. దీంతో నివాసితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఈసీ, మూసీ వాగుల కారణంగా పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు కూడా భారీగా దెబ్బతిన్నట్లు సమాచారం.

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన అధికారులకు సూచించారు.




More Telugu News