త్వరలోనే గాజాపై ఒప్పందం: ట్రంప్

  • కీలక ప్రకటన చేసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్
  • గాజాలో యుద్దం ముగించేందుకు త్వరలో కీలక ఒప్పందం జరగనుందన్న ట్రంప్
  • బందీలను తిరిగి తీసుకురావడం వంటి అంశాలు ఒప్పందంలో ఉంటాయన్న ట్రంప్
గాజాలో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఒక కీలక ఒప్పందం త్వరలోనే కుదరబోతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. బందీలను తిరిగి తీసుకురావడం, యుద్ధానికి ముగింపు పెట్టడం వంటి అంశాలు ఈ ఒప్పందంలో భాగంగా ఉంటాయని తెలిపారు.

న్యూయార్క్‌లో నిర్వహించనున్న రైడర్ కప్ గోల్ఫ్ టోర్నమెంట్‌లో పాల్గొనడానికి బయలుదేరే ముందు, వైట్‌హౌస్ వద్ద మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

"గాజాపై ఒక ఒప్పందం కుదిరే దిశగా ఉన్నాం. ఇది బందీలను తిరిగి తీసుకురావడమే కాదు, యుద్ధానికి ముగింపు కలిగించే ఒప్పందంగా మారుతుంది," అని ఆయన పేర్కొన్నారు. అయితే, ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం ట్రంప్ వెల్లడించలేదు.

ఈ నేపథ్యంలో, అమెరికా ప్రభుత్వం పశ్చిమాసియాలో శాంతి సాధన కోసం రూపొందించిన 21-పాయింట్ల ప్రణాళికను ఇప్పటికే సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్, ఈజిప్ట్, జోర్డాన్, తుర్కియే, ఇండోనేసియా, పాకిస్థాన్ వంటి దేశాలకు పంపినట్టు సమాచారం.

ఇదిలా ఉండగా, ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. హమాస్‌పై చేపట్టిన సైనిక ఆపరేషన్‌ను తప్పకుండా పూర్తి చేస్తామన్నారు. "పాశ్చాత్య దేశాల ఒత్తడి వల్ల కొందరు పాలస్తీనాను దేశంగా గుర్తించినా, ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గదు," అని ఆయన తేల్చి చెప్పారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గాజాలో శాంతి పునరుద్ధరణకు, బందీల విముక్తికి మార్గం సుగమమవుతుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. 


More Telugu News