బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి: అఖిల భారత చిరంజీవి యువత

  • అసెంబ్లీలో చిరంజీవిపై బాలకృష్ణ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారని ఆరోపణ
  • బాలయ్య వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని మెగా ఫ్యాన్స్ డిమాండ్
  • గతంలోనూ మెగా ఫ్యామిలీని అవమానించారని అభిమాన సంఘం ఆరోపణ
  • కష్టకాలంలో తాము అండగా నిలిచామని గుర్తు చేసిన అభిమానులు
  • క్షమాపణ చెప్పకపోతే తీవ్ర నిరసనలు తప్పవని హెచ్చరిక
నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై అఖిల భారత చిరంజీవి యువత ఆగ్రహం వ్యక్తం చే'సింది. బాలకృష్ణ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు సోషల్ మీడియాలో స్పందించారు.

"అసెంబ్లీ సాక్షిగా మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడిన నందమూరి బాలకృష్ణ వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. తనను తాను అతీత శక్తిగా భావించుకుంటూ నందమూరి బాలకృష్ణ గారు మెగా కుటుంబంపై గతంలో కూడా అనేక సార్లు అవమానకరంగా మాట్లాడటం జరిగింది. వివాదాలకు దూరంగా ఉండే మా చిరంజీవి గారు ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. అభిమానులుగా మేము కూడా ఆయన మనసెరిగి సంయమనం పాటించాం. బాలకృష్ణ కుటుంబం తీవ్ర వేధింపులకు గురై, జైలు పాలైనప్పుడు మెగా కుటుంబం అండగా నిలిచింది. ఆయన కుటుంబం అధికారంలోకి రావడానికి కారణం మెగా కుటుంబమే! మెగా కుటుంబం అండగా నిలవకపోయుంటే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఒక్కసారి ఊహించుకుంటే మంచిదని హితవు పలుకుతున్నాం. మరోసారి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే మెగా అభిమానుల తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుంది. చిరంజీవి అభిమానులుగా మేము సైతం బాలకృష్ణ వైఖరిని, వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే బాలకృష్ణ స్పందించి, బహిరంగ క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేస్తున్నాం. లేని యెడల బాలకృష్ణ ప్రజాక్షేత్రంలో తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం" అంటూ అఖిల భారత చిరంజీవి యువత తరఫున సోషల్ మీడియాలో ఓ ప్రకటన చేశారు. 



More Telugu News