పవన్ కల్యాణ్ కు అస్వస్థత.. హైదరాబాద్ కు వెళుతున్న డిప్యూటీ సీఎం

  • నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న పవన్ కల్యాణ్
  • దగ్గు కూడా ఉండటంతో నీరసించిన వైనం
  • వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు వెళుతున్న పవన్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్న ఆయన, మెరుగైన వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. వైద్యుల సూచన మేరకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళితే, పవన్ కల్యాణ్ గత నాలుగు రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. జ్వరంతో పాటు తీవ్రమైన దగ్గు కూడా ఉండటంతో ఆయన నీరసించిపోయినట్లు తెలుస్తోంది. మంగళగిరిలో చికిత్స తీసుకుంటున్నప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో, హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో ఆయన ఈరోజు మంగళగిరి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.

ఆరోగ్యం సహకరించకపోయినా, పవన్ కల్యాణ్ తన అధికారిక విధులకు ఆటంకం కలిగించలేదు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతూనే సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఆ రోజు రాత్రి నుంచి జ్వరం తీవ్రత మరింత పెరిగినట్లు సమాచారం. అయినప్పటికీ, రెండు రోజుల క్రితం తన శాఖకు సంబంధించిన అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్ష జరిపినట్లు జనసేన పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. నాలుగు రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో, పూర్తిస్థాయి వైద్య పరీక్షల కోసం ఆయన హైదరాబాద్ వెళుతున్నారు. 


More Telugu News