Viral Video: బెంగళూరులో దారుణం.. దొంగను పట్టుకొని చితక్కొట్టిన యజమాని.. కట్ చేస్తే సీన్ రివర్స్!

Bengaluru Shop Owner Assaults Woman Allegedly Stealing Sarees
  • బెంగళూరులో చీరల దుకాణంలో భారీ దొంగతనం
  • రూ.91 వేల విలువైన 61 చీరలు అపహరించిన మహిళ
  • మరుసటి రోజు పట్టుకొని నడిరోడ్డుపై చితకబాదిన యజమాని
  • దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో తీవ్ర విమర్శలు
  • దొంగతనం కేసులో మహిళ, దాడి కేసులో యజమాని అరెస్ట్
చీరలు దొంగిలించిందన్న ఆరోపణతో ఓ మహిళపై దుకాణం యజమాని, అతని సిబ్బంది నడిరోడ్డుపై అమానుషంగా దాడి చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు చివరికి వారే కటకటాల పాలయ్యారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది.

వివరాల్లోకి వెళితే... బెంగళూరు అవెన్యూ రోడ్డులోని 'మాయా సిల్క్స్ శారీస్' అనే వస్త్ర దుకాణంలోకి ఈ నెల 20వ తేదీన ఓ మహిళ ప్రవేశించింది. దుకాణదారుల కళ్లుగప్పి సుమారు రూ.91,500 విలువ చేసే 61 చీరలు ఉన్న ఒక కట్టను ఆమె దొంగిలించింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనిపై దుకాణం యజమాని సిటీ మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అయితే, మరుసటి రోజే ఆ మహిళ మళ్లీ అదే దుకాణం వద్ద కనిపించడంతో యజమాని, అతని సిబ్బంది ఆమెను పట్టుకున్నారు. దొంగిలించిన చీరల గురించి నిలదీస్తూ, ఆమెను నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. కాళ్లతో తంతూ, తీవ్ర పదజాలంతో దూషించారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది.

ఈ వీడియోపై కన్నడ సంఘాలు, పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దొంగతనం చేస్తే పోలీసులకు అప్పగించాలి కానీ, ఇలా నడిరోడ్డుపై ఒక మహిళపై దాడి చేయడం ఏమిటని మండిపడ్డారు. ఒత్తిడి పెరగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దొంగతనం ఆరోపణలపై సదరు మహిళను అరెస్ట్ చేసి, ఆమె నుంచి చీరలను స్వాధీనం చేసుకున్నారు. 

అదే సమయంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మహిళపై దాడికి పాల్పడిన దుకాణం యజమాని, అతని సిబ్బందిని కూడా అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. 
Viral Video
Bengaluru
Bengaluru shop owner
Karnataka
shop owner arrested
Maya Silks Sarees
Avenue road Bangalore
cheating case
theft case
city market police
viral video

More Telugu News