Inderjit Singh Gosal: కెనడాలో ఖలిస్థానీలకు మరో షాక్.. అరెస్టయిన నిజ్జర్ వారసుడు గోసల్

Canada Arrests Inderjit Singh Gosal on Weapons Charges
  • కెనడాలో కీలక ఖలిస్థానీ ఉగ్రవాది ఇందర్‌జీత్ గోసల్ అరెస్ట్
  • గోసల్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలు
ఖలిస్థానీ ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిన కెనడాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్యకు గురైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ వారసుడిగా భావిస్తున్న ఇందర్‌జీత్ సింగ్ గోసల్‌ (36) ను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై అతడితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కెనడాలోని ఒషావాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే, సెప్టెంబర్ 19న ఒంటారియో ప్రావిన్షియల్ పోలీసులు (ఓపీపీ) హైవే 407 సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇందర్‌జీత్ గోసల్‌తో పాటు అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన జగ్దీప్ సింగ్ (41), టొరంటో నివాసి అర్మాన్ సింగ్ (23) లను అరెస్ట్ చేశారు. వారిపై నిర్లక్ష్యంగా ఆయుధాలు వినియోగించడం, ప్రమాదకరమైన ఆయుధాలు కలిగి ఉండటం, ఆయుధాలను దాచిపెట్టడం వంటి అభియోగాలపై కెనడా క్రిమినల్ కోడ్ కింద కేసులు నమోదు చేశారు. నిందితులను సెప్టెంబర్ 22న ఒషావాలోని ఒంటారియో కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, ఎవరికైనా సమాచారం తెలిస్తే తమకు అందించాలని అధికారులు ప్రజలను కోరారు.

దోవల్ భేటీ రోజే అరెస్ట్:

ఇందర్‌జీత్ గోసల్ "సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ)" అనే వేర్పాటువాద సంస్థలో కీలకమైన వ్యక్తిగా పనిచేస్తున్నాడు. 2023 జూన్‌లో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఖలిస్థానీ ఉద్యమంలో ఇతడు కీలకంగా మారాడు. సరిగ్గా వీరి అరెస్టు జరిగిన సెప్టెంబర్ 19వ తేదీనే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కెనడా భద్రతా సలహాదారు నథాలీ డ్రూయిన్‌తో సమావేశమయ్యారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ నేరాలపై పరస్పరం సహకరించుకోవాలని ఈ భేటీలో ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. అదే రోజు ఈ అరెస్టు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. కెనడా గడ్డపై నుంచి ఖలిస్థానీ ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని భారత్ చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. 
Inderjit Singh Gosal
Hardeep Singh Nijjar
Khalistan
Canada
Sikhs for Justice
SFJ
Ajit Doval
Nathalie Drouin
illegal weapons
Oshawa

More Telugu News