వ్యక్తి కడుపులో 29 స్పూన్లు, 19 టూత్‌బ్రష్‌లు.. ఆపరేషన్ చేసి తీసిన డాక్టర్లు!

  • ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌లో వింత ఘటన
  • డీ-అడిక్షన్ సెంటర్‌పై కోపంతో యువకుడి నిర్వాకం
  • స్పూన్లు, టూత్‌బ్రష్‌లు, పెన్నులు మింగేసిన వైనం
  • కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లగా బయటపడ్డ నిజం
  • ఆపరేషన్ చేసి 50కి పైగా వస్తువులు తొలగించిన వైద్యులు
  • మానసిక సమస్యలతోనే ఇలాంటివి జరుగుతాయన్న డాక్టర్లు
కడుపు నొప్పంటూ ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తి పొట్టలో ఉన్న వస్తువులను చూసి వైద్యులు నివ్వెరపోయారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్‌బ్రష్‌లు, రెండు పెన్నులను ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వివరాల్లోకి వెళితే... హాపుర్‌కు చెందిన 35 ఏళ్ల సచిన్‌ను అతని కుటుంబ సభ్యులు ఘజియాబాద్‌లోని ఒక డీ-అడిక్షన్ సెంటర్‌లో చేర్పించారు. అయితే, తనను అక్కడ వదిలి వెళ్లడం, సెంటర్‌లో సరైన ఆహారం పెట్టకపోవడంతో సచిన్ తీవ్రమైన కోపానికి గురయ్యాడు. రోజంతా కొన్ని చపాతీలు, కొద్దిగా కూర మాత్రమే ఇచ్చేవారని, కొన్నిసార్లు కేవలం ఒక బిస్కెట్‌తో సరిపెట్టేవారని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ క్రమంలోనే సెంటర్‌పై తన కోపాన్ని వింత రూపంలో ప్రదర్శించాడు. వంటగదిలోని స్టీల్ స్పూన్లను దొంగిలించి, బాత్రూమ్‌లోకి తీసుకెళ్లేవాడు. వాటిని ముక్కలుగా విరిచి, నోట్లో పెట్టుకుని నీళ్ల సహాయంతో గొంతులోకి తోసేసుకునేవాడు. ఇలా స్పూన్లతో పాటు టూత్‌బ్రష్‌లు, పెన్నులను కూడా మింగడం ప్రారంభించాడు.

కొన్ని రోజుల తర్వాత తీవ్రమైన కడుపునొప్పి రావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. ఎక్స్-రే, సీటీ స్కాన్ తీసిన వైద్యులు, అతని కడుపులో పేరుకుపోయిన వస్తువులను చూసి షాక్‌కు గురయ్యారు. మొదట ఎండోస్కోపీ ద్వారా వాటిని తొలగించేందుకు ప్రయత్నించినా, అవి పెద్ద సంఖ్యలో ఉండటంతో విఫలమయ్యారు. దీంతో శస్త్రచికిత్స చేసి వాటన్నింటినీ విజయవంతంగా బయటకు తీశారు.

"ఇలాంటి ఘటనలు తరచూ మానసిక సమస్యలు ఉన్నవారిలో కనిపిస్తాయి" అని సచిన్‌కు ఆపరేషన్ చేసిన డాక్టర్ శ్యామ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం సచిన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.


More Telugu News