'ఓజీ'పై అంబటి యూటర్న్.. నిన్న ప్రశంస, నేడు విమర్శ!

  • విడుదలకు ముందు బ్లాక్‌బస్టర్ అంటూ ప్రశంసల వర్షం
  • రిలీజ్ తర్వాత 'దండగ' అంటూ విమర్శనాస్త్రాలు
  • అంబటి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంతో పవన్ ఫ్యాన్స్
  • సోషల్ మీడియాలో పొలిటికల్ హీట్ పెంచిన 'ఓజీ' వివాదం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రం చుట్టూ ఇప్పుడు రాజకీయ రచ్చ మొదలైంది. ఈ సినిమాపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కేవలం 24 గంటల వ్యవధిలో తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకోవడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. సినిమా ఫలితం కంటే ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

సినిమా విడుదలకు ముందు, రాజకీయ ప్రత్యర్థి అయినప్పటికీ పవన్ కల్యాణ్ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ అంబటి ఒక వీడియో సందేశం విడుదల చేశారు. "పవన్ ఈసారి కసితో పనిచేశాడు. దర్శకుడు సుజీత్, నిర్మాత దానయ్య పట్టుదల గొప్పది. వారి కష్టం ఫలించాలి. ఓజీ కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది" అని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో జనసైనికులు సైతం ఆశ్చర్యపోతూనే ఆయన్ను అభినందించారు.

అయితే, సినిమా విడుదలైన కొన్ని గంటలకే అంబటి రాంబాబు తన మాట మార్చారు. బుధవారం రాత్రి చేసిన మరో ట్వీట్‌లో సినిమా ఫలితంపై పెదవి విరిచారు. "ప్రత్యర్థి అయినా పవన్ సినిమా ఆడాలని నా ఆరాటమే కానీ ఫలితం మాత్రం శూన్యం. దానయ్యా... దండగ పడ్డావయ్యా!" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

అంబటి రాంబాబు యూటర్న్‌పై పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. "మీ నుంచి ఇదే ఊహించాం. నిన్న బ్లాక్‌బస్టర్ అని నమ్మిన మీరే, ఈరోజు ఇలా మాట్లాడటంలోనే మీ కపటత్వం తెలుస్తోంది" అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారంతో 'ఓజీ' సినిమా చుట్టూ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

ఇక 'ఓజీ' సినిమా విషయానికొస్తే, సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. పవన్ అభిమానులు సినిమాను ఆస్వాదిస్తుండగా, కొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఏదేమైనా, సినిమా ఫలితం కన్నా అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలే ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


More Telugu News