బెంగళూరు ట్రాఫిక్ కోసం విప్రో క్యాంపస్ గేట్లు తెరవలేం: ముఖ్యమంత్రి విజ్ఞప్తికి నో చెప్పిన అజీమ్ ప్రేమ్‌జీ

  • ట్రాఫిక్ సమస్యను కొంత వరకైనా తగ్గించేందుకు క్యాంపస్ గేట్లు తెరవాలని సిద్ధరామయ్య లేఖ
  • క్యాంపస్‌ను రోడ్డు మార్గంగా ఉపయోగించుకునేందుకు తెరవలేమన్న ప్రేమ్‌జీ
  • సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని వెల్లడి
బెంగళూరు నగర ట్రాఫిక్ సమస్యను కొంతమేరకైనా తగ్గించేందుకు వీలుగా విప్రో క్యాంపస్ నుంచి వాహనాలు రాకపోకలకు అనుమతినివ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన విజ్ఞప్తిపై విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ స్పందించారు. తమ కంపెనీ క్యాంపస్‌ను రోడ్డు మార్గంగా వినియోగించడానికి వీలుకాదని ఆయన స్పష్టం చేశారు.

ఈ విషయంలో అనేక చట్టపరమైన, ప్రభుత్వపరమైన సవాళ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సర్జాపూర్ వద్ద ఉన్న తమ క్యాంపస్ ఒక ప్రైవేటు ప్రాపర్టీ అని, అంతేకాకుండా అంతర్జాతీయ క్లయింట్లకు సేవలు అందిస్తున్న సెజ్‌లో భాగమని ఆయన వివరించారు. ఇదివరకే కుదుర్చుకున్న ఒప్పందాల కారణంగా కఠినమైన యాక్సెస్ కంట్రోల్ నిబంధనలను అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

ఒకవేళ తమ క్యాంపస్‌ను బెంగళూరు ట్రాఫిక్ కోసం తెరిచినా ట్రాఫిక్ సమస్య‌కు శాశ్వత పరిష్కారం లభించదని అజీమ్ ప్రేమ్‌జీ అభిప్రాయపడ్డారు. ఈ సమస్యకు డేటా ఆధారిత పరిష్కారం కనుగొనడానికి కర్ణాటక ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా, రాష్ట్ర అధికారులతో తదుపరి చర్చలు సమన్వయం కోసం సీనియర్ కంపెనీ ప్రతినిధి రేష్మి శంకర్‌ను నియమించినట్లు ఆయన తెలిపారు.


More Telugu News