ఇప్పుడు బాలకృష్ణ తీరు చూస్తుంటే ఆ సర్టిఫికెట్ నిజమేననిపిస్తోంది: పేర్ని నాని

  • జగన్ ను సైకో గాడు అంటూ బాలయ్య వ్యాఖ్యలు 
  • మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ఫైర్
  • బాలయ్యకు గతంలో ఇచ్చిన మెంటల్ సర్టిఫికెట్ నిజమేననిపిస్తోందని వ్యాఖ్య
  • సెంబ్లీలో బాలయ్యకు మైక్ కట్ చేసే దమ్ము సభలో ఎవరికీ లేదా అని ప్రశ్న
  • మహానుభావుడి ఇంట్లో పుట్టిన సంస్కారహీనుడంటూ తీవ్ర విమర్శలు
  • అఖండ' సినిమా సమయంలో జగన్‌తో మాట్లాడాలని ఫోన్ చేశారని వెల్లడి
టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రస్తుత తీరు చూస్తుంటే, ఆయనకు గతంలో ఇచ్చిన మెంటల్ సర్టిఫికెట్ నిజమేననిపిస్తోందని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఉద్దేశించి బాలకృష్ణ "సైకో గాడు" అని చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

గురువారం అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తావన వచ్చినప్పుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పేర్ని నాని స్పందిస్తూ బాలకృష్ణపై విరుచుకుపడ్డారు. "ఒక మహానుభావుడి ఇంట్లో ఇలాంటి సంస్కారహీనుడు పుట్టడం విచారకరం. అసెంబ్లీలో ఆయన అలా మాట్లాడుతుంటే మైక్ కట్ చేయాల్సింది. కానీ, సభలో ఆయన మైక్ కట్ చేసేంత దమ్మున్న వాళ్లు ఎవరూ లేనట్లుంది" అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.

"'అఖండ' సినిమా విడుదల సమయంలో ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడించాలని కోరుతూ ఆయన స్వయంగా నాకు ఫోన్ చేశారు" అని పేర్ని నాని వెల్లడించారు. కాగా, బాలయ్య వ్యాఖ్యలపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి స్పందించడం తెలిసిందే. 


More Telugu News