డిజిటల్ చెల్లింపులపై ఆర్బీఐ కొత్త రూల్స్... ఎప్పట్నించి అంటే!

  • డిజిటల్ చెల్లింపులపై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాల ముసాయిదా విడుదల
  • 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న నిబంధనలు
  • కొనసాగనున్న ఎస్ఎంఎస్ ఓటీపీ విధానం
  • భద్రత కోసం కొత్త టెక్నాలజీలను ప్రోత్సహించాలని సూచన
  • అన్ని లావాదేవీలకు రెండు దశల అథెంటికేషన్ తప్పనిసరి
దేశంలో డిజిటల్ చెల్లింపుల భద్రతను మరింత పటిష్ఠం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్ లావాదేవీల నిర్ధారణకు సంబంధించిన నూతన మార్గదర్శకాల ముసాయిదాను గురువారం విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు 2026, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అయితే, ప్రస్తుతం అందరూ ఉపయోగిస్తున్న ఎస్ఎంఎస్ ఆధారిత ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్) విధానాన్ని మాత్రం తొలగించడం లేదని ఆర్బీఐ స్పష్టం చేయడం గమనార్హం.

ఈ కొత్త మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా చెల్లింపుల వ్యవస్థలో నూతన భద్రతా పద్ధతులను ప్రోత్సహించడమేనని ఆర్బీఐ తెలిపింది. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ ముసాయిదాను రూపొందించినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఉన్న రెండు దశల అథెంటికేషన్ విధానం యథాతథంగా కొనసాగుతుందని, అయితే ఎస్ఎంఎస్ ఓటీపీతో పాటు ఇతర ఆధునిక టెక్నాలజీలను కూడా వినియోగించుకునే స్వేచ్ఛను బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు కల్పించినట్లు వివరించింది.

ఆర్బీఐ నిబంధనల ప్రకారం, ఇకపై ప్రతి డిజిటల్ లావాదేవీకి తప్పనిసరిగా రెండు వేర్వేరు అథెంటికేషన్ పద్ధతులు ఉండాలి. వాటిలో కనీసం ఒకటి, ఆ లావాదేవీకి మాత్రమే ప్రత్యేకంగా డైనమిక్‌గా క్రియేట్ కావాలి. ఒకవేళ ఒక భద్రతా ఫ్యాక్టర్ హ్యాకర్ల చేతికి చిక్కినా, రెండోది సురక్షితంగా ఉండేలా వ్యవస్థను రూపొందించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది.

అంతేకాకుండా, విదేశాల్లో కార్డును భౌతికంగా ఉపయోగించకుండా చేసే నాన్-రికరింగ్ లావాదేవీల విషయంలో, అవతలి వైపు నుంచి అభ్యర్థన వస్తే తప్పనిసరిగా అదనపు అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కార్డు జారీ సంస్థలను ఆదేశించింది. మోసాల తీవ్రతను బట్టి, కనీస రెండు దశల అథెంటికేషన్‌కు మించి అదనపు భద్రతా తనిఖీలను కూడా చేపట్టే వెసులుబాటును ఈ మార్గదర్శకాలు కల్పిస్తున్నాయి. టోకెనైజేషన్, అథెంటికేషన్ సేవలు అన్ని రకాల అప్లికేషన్లకు అందుబాటులో ఉండేలా చూడాలని కూడా ఆర్బీఐ సూచించింది.


More Telugu News