రష్యాతో యుద్ధం ముగిశాక పదవిని వదిలేస్తా.. నా లక్ష్యం అదే: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

  • అధ్యక్ష పదవికి పోటీ చేయడం తన లక్ష్యం కాదన్న జెలెన్‌స్కీ
  • యుద్ధాన్ని ముగించడమే తన లక్ష్యమని స్పష్టీకరణ
  • ఎవరు బతకాలో ఆయుధాలు నిర్ణయిస్తున్నాయని ఆందోళన
రష్యాతో యుద్ధం ముగిసిన అనంతరం తాను పదవిని వదులుకుంటానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. రష్యాతో యుద్ధాన్ని ముగించడమే తన ప్రధాన లక్ష్యమని, అధ్యక్ష పదవికి పోటీ చేయడం కాదని ఆయన స్పష్టం చేశారు. వీలైతే ఎన్నికలు నిర్వహించాలని తన దేశ పార్లమెంటును కోరుతానని కూడా తెలిపారు. రష్యాతో జరుగుతున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.

ఎవరు బతకాలో ఆయుధాలు నిర్ణయిస్తున్నాయి

ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయని జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచంలో మానవ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన ఆయుధ పోటీ నెలకొందని అన్నారు. రష్యాకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ సమాజాన్ని ఆయన కోరారు.

ఐక్యరాజ్యసమితితో సహా ఇతర బలహీన అంతర్జాతీయ సంస్థలు ఉక్రెయిన్, గాజా, సూడాన్‌లలో జరుగుతున్న యుద్ధాలను నిలువరించలేకపోయాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. రష్యా తమపై యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉందని ఆయన అన్నారు. పుతిన్ ఇప్పుడు యుద్ధాన్ని ఆపకపోతే అది మరింత విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా డ్రోన్లు యూరప్ అంతటా ఎగురుతున్నాయని ఆయన పేర్కొన్నారు.


More Telugu News