‘ఓజీ’ విడుదల నేపథ్యంలో సుజీత్ ఎమోషనల్ పోస్టు

  • నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ 'ఓజీ'
  • థియేటర్ల వద్ద పండుగ వాతావరణం.. ఫ్యాన్స్ హంగామా
  • పవన్ స్టైల్, బీజీఎం, యాక్షన్ సీన్స్‌కు సూపర్ రెస్పాన్స్
  • 'పవన్ ఈజ్ బ్యాక్' అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్
 గ్యాంగ్‌స్టర్ కథాంశంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఓజీ’ ఈ రోజు భారీ ఎత్తున విడుద‌లైంది. ఈ సినిమా విడుదల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం ప్రదర్శనలు ప్రారంభమైనప్పటి నుంచే సినిమాకు అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. పవన్ మాస్ అప్పీల్‌ను దర్శకుడు సుజీత్ అద్భుతంగా తెరకెక్కించారని, కథ, సంగీతం, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు సుజీత్ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో భావోద్వేగభరిత పోస్ట్ చేశారు. "They Call Him OG మీ ముందుకు వచ్చింది. ఎన్నో సంవత్సరాల ప్రయాణం చివరకు పూర్తైంది. ఉత్సాహంతో పాటు కొంత బాధ కూడా ఉంది. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. నా డైరెక్షన్, టెక్నీషియన్ టీంకి ‘ఐ లవ్ యూ’! ఇంకా ఎంత చెప్పినా తక్కువే. నన్ను నమ్మిన మా నిర్మాతలు దానయ్య, కల్యాణ్ దాసరి, సినిమా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డ తమన్ అన్నకి థ్యాంక్స్. సినిమాటోగ్రాఫర్ నవీన్ నూలి బ్రో.. నీ మ్యాజిక్ తెరపై ఆడియన్స్ చూసే క్షణాన్ని నేను కూడా ఎదురుచూస్తున్నాను. ఈరోజు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, మ్యాడ్‌నెస్ ఊహించలేనిది! ఇది కేవలం ఆరంభం మాత్రమే. అన్నీ బాగుంటే ‘ఓజీ’ ఇంకా పెద్దదిగా మారుతుంది. లవ్ యూ మై పవర్ స్టార్‌" అంటూ రాసుకొచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా థియేటర్ల వద్ద పవన్ అభిమానులు ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి, బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ‘పవన్ ఈజ్ బ్యాక్’ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. స్టైలిష్ స్క్రీన్‌ప్లే, పవర్‌ఫుల్ డైలాగ్స్, అదిరిపోయే నేపథ్య సంగీతంతో ‘ఓజీ’ చిత్రం మాస్, క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ తొలిరోజే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.


More Telugu News