ఆసియా కప్‌లో అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర.. జయసూర్య 17 ఏళ్ల రికార్డు బ్రేక్

  • ఆసియా కప్‌లో చరిత్ర సృష్టించిన యువ బ్యాటర్ అభిషేక్ శర్మ
  • ఒకే ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు నమోదు
  • శ్రీలంక దిగ్గజం సనత్ జయసూర్య రికార్డు బద్దలు
  • బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 37 బంతుల్లో 75 పరుగులతో విధ్వంసం
  • ఈ టోర్నీలో ఇప్పటివరకు మొత్తం 16 సిక్సర్లు బాదిన అభిషేక్
టీమిండియా యువ సంచలనం, బ్యాటర్ అభిషేక్ శర్మ ఆసియా కప్ చరిత్రలో సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒకే ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలిచి, శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య పేరిట ఉన్న 17 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.

నిన్న‌ బంగ్లాదేశ్‌తో జరిగిన ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ మ్యాచ్‌లో అభిషేక్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అతడు బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 37 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 భారీ సిక్సర్ల సహాయంతో 75 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

ఈ ఇన్నింగ్స్‌లో బాదిన 5 సిక్సర్లతో ఈ టోర్నీలో అభిషేక్ మొత్తం సిక్సర్ల సంఖ్య 16కి చేరింది. దీంతో 2008లో సనత్ జయసూర్య నెలకొల్పిన 14 సిక్సర్ల రికార్డు కనుమరుగైంది. ఆసియా కప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో 15కు పైగా సిక్సర్లు కొట్టిన ఏకైక క్రికెటర్‌గా అభిషేక్ శర్మ నిలవడం విశేషం.

శతకం చేసేలా కనిపించిన అభిషేక్, షార్ట్ థర్డ్ మ్యాన్‌లో ఉన్న ఫీల్డర్ రిషాద్ హుస్సేన్ అద్భుతమైన ఫీల్డింగ్‌కు రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. 


More Telugu News