విజయవాడ ఉత్సవ్‌లో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కీలక వ్యాఖ్యలు

  • విజయవాడ పర్యటన తన జీవితంలో మరిచిపోలేని అనుభవంగా నిలిచిపోతుందన్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
  • విజయవాడ హాట్ సిటీ .. కూల్ పీపుల్స్ అని వ్యాఖ్య
  • చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ‘‘వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌’’ దిశగా ముందుకు సాగుతోందన్న సీపీ రాధాకృష్ణన్
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా నిన్న పున్నమి ఘాట్‌లో నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ - 2025 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగులో "అందరికీ నమస్కారం" అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన సీపీ రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నపూర్ణలాంటిదని అన్నారు.

తెలుగు భాష యొక్క అందం, సాహిత్యం, సంగీతం వైభవాన్ని ఆయన ప్రశంసించారు. తెలుగులో పాడిన పాటలు అద్భుతంగా ఉంటాయని కొనియాడారు. విజయవాడ ఉత్సవ్ మరిన్ని దశాబ్దాలు, శతాబ్దాలు కొనసాగాలని ఆకాంక్షించారు. "విజయవాడ హాట్ సిటీ.. కూల్ పీపుల్" అని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో విజయవాడ నగరం అభివృద్ధి చెందిన నగరంగా నిలవబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారికంగా మొదటిసారి విజయవాడకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విజయవాడలో తనకు అద్భుతమైన గౌరవం లభించిందని అన్నారు. ఇక్కడి సంప్రదాయాలు, సంస్కృతి దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటన తన జీవితంలో మరిచిపోలేని అనుభవంగా నిలిచిపోతుందని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం ‘‘వికసిత్ ఆంధ్రప్రదేశ్’’ దిశగా ముందుకు సాగుతోందని కొనియాడారు. ప్రజలందరికీ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. తన ప్రసంగాన్ని ‘‘జై ఆంధ్రప్రదేశ్!’’ అనే నినాదంతో ముగించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు. 


More Telugu News