భారత్‌ను ఆ రెండు దేశాలతో కలిపి చూడకూడదు: ఫిన్లాండ్ అధ్యక్షుడి మద్దతు

  • ఢిల్లీ సూపర్ పవర్‌గా ఎదుగుతోందన్న అలగ్జాండర్
  • ఐరోపా సమాఖ్యతో, అమెరికాతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్య
  • భారత్ ఎదుగుతున్న మహాశక్తి అన్న ఫిన్లాండ్ అధ్యక్షుడు
భారతదేశాన్ని రష్యా, చైనా దేశాలతో కలిపి చూడరాదని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలగ్జాండర్ స్టబ్ అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీ ఒక సూపర్ పవర్‌గా ఎదుగుతోందని, ఈ దేశంతో కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. బ్లూమ్‌బర్గ్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో భాగంగా, భారత్, రష్యా, చైనా మధ్య స్నేహం పెరగుతున్నదనే ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు.

ఐరోపా సమాఖ్యకు భారత్ అత్యంత సన్నిహిత దేశమని ఆయన పేర్కొన్నారు. అమెరికాతో కూడా భారత్‌కు సత్సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. అందువల్లనే ఆ దేశాన్ని చైనా, రష్యాతో కలిపి చూడకూడదని పశ్చిమ దేశాలకు ఆయన సూచించారు. భారతదేశం ఎదుగుతున్న మహాశక్తి అని, జనాభా, ఆర్థిక వ్యవస్థ రెండూ కలిసి రావటం సానుకూల అంశమని వ్యాఖ్యానించారు. పశ్చిమ దేశాలు భారత్‌తో సఖ్యతగా ఉంటూ, కలిసి పనిచేయడానికి ప్రయత్నించాలని ఆయన అన్నారు.

అదే సమయంలో చైనా, రష్యా దేశాలకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని అలగ్జాండర్ పేర్కొన్నారు. 1990 వరకు రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు సమానంగా ఉండగా, ప్రస్తుతం చైనా పది రెట్లు పెద్దదని తెలిపారు. గ్యాస్, చమురు, సాంకేతిక పరిజ్ఞానం వంటి వాటి మార్పిడితో రష్యాను యుద్ధాలు చేసేంతగా చైనా బలపరిచిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. గతంలో కూడా అలగ్జాండర్ భారత్‌కు మద్దతుగా ప్రకటనలు చేశారు.


More Telugu News