Jagan: జగన్ రాజకీయ జీవితం ముగిసినట్టే: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Gorantla Butchaiah Chowdary Comments on Jagans Political Future
  • జగన్‌పై ఉన్న అవినీతి, ఈడీ కేసులు తుది దశకు చేరాయన్న బుచ్చయ్య చౌదరి
  • తాడేపల్లి ప్యాలెస్‌లో బూతుల పండుగ నిర్వహించారని విమర్శ
  • ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం జగన్ ఆరాటపడుతున్నారని మండిపాటు
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రాజకీయ జీవితం చరమాంకానికి చేరుకుందని, ఆయనపై నమోదైన అవినీతి, ఈడీ కేసులు తుది దశలో ఉన్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అవినీతి ఆరోపణలతో 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన వ్యక్తి ఇప్పుడు బయటకొచ్చి పుష్కరోత్సవాలు జరుపుకుంటున్నారని గోరంట్ల ఎద్దేవా చేశారు. "జగన్‌పై ఉన్న కేసుల విచారణ చివరి దశకు చేరుకుంది. ఈ కేసుల్లో ఆయనకు ఇంకెన్నేళ్లు జైలు శిక్ష పడుతుందోనని అనిపిస్తోంది" అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా దోచుకుని, అవినీతికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు.

సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలాన్ని వ్యాప్తి చేసేందుకే తాడేపల్లి ప్యాలెస్‌లో ‘బూతోత్సవం’ నిర్వహించారని బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించి, ఇవ్వని ప్రతిపక్ష నేత హోదా కోసం జగన్ పట్టుబట్టడం ఆయన అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. ‘ఒక్క అవకాశం’ అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలను నట్టేట ముంచారని, అయితే ప్రజలు మళ్లీ మోసపోయేంత అమాయకులు కాదని స్పష్టం చేశారు.

కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంటే ఓర్వలేక, వైసీపీ నేతలు పనిగట్టుకుని బురద చల్లే కార్యక్రమం పెట్టుకున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల మాటలను ప్రజలు విశ్వసించడం ఎప్పుడో మానేశారని, ఈ నిజాన్ని ఆ పార్టీ నేతలు ఇప్పటికైనా గ్రహించాలని బుచ్చయ్య చౌదరి హితవు పలికారు.

Jagan
YS Jagan
Andhra Pradesh
TDP
Corruption
AP Assembly
Tadepalli Palace
Telugu Desam Party
Political News

More Telugu News