Telangana High Court: బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు.. పిటిషనర్లపై ఆగ్రహం

Telangana High Court Dismisses Petitions on BC Reservations
  • 42 శాతం రిజర్వేషన్లు చట్టవిరుద్ధమంటూ పిటిషన్లు
  • పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్న
  • సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పత్రికా వార్తలను పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టీకరణ
తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పత్రికల్లో ప్రచురితమైన కథనాల ఆధారంగా పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని పిటిషనర్లపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవపూర్ గ్రామానికి చెందిన మాధవరెడ్డి, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన జలపల్లి మల్లవ్వలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285ఏ ప్రకారం రిజర్వేషన్లు కల్పించి, ఆ మేరకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని వారు కోరారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం, పిటిషన్ వేయడానికి గల ఆధారాలేమిటని ప్రశ్నించింది. పిటిషనర్ అర్హతను కూడా ప్రశ్నించింది. కేవలం మీడియా వార్తల ఆధారంగా పిటిషన్లు వేయడం సరికాదని పేర్కొంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం పత్రికా వార్తలను పరిగణనలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పించడంతో పాటు, అదే సమయంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పిటిషనర్లు ఆరోపించారు. దీని ద్వారా ఎన్నికల ప్రక్రియను, స్ఫూర్తిని దెబ్బతీసేలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని వారు వాదించారు. 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే 50 శాతం పరిమితిని దాటుతుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని వారు పేర్కొన్నారు. కావున, పాత విధానంలోనే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు.
Telangana High Court
BC Reservations
Telangana
High Court
Reservations
Local Body Elections

More Telugu News