Jagan Mohan Reddy: హైకోర్టులో జగన్ పిటిషన్.. అయ్యన్న, పయ్యావులకు నోటీసులు

Ayyanna Patrudu Payyavula Keshav Get Notices in Jagan Case
  • ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టులో జగన్ పిటిషన్
  • పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం
  • స్పీకర్ అయ్యన్న, మంత్రి పయ్యావులకు నోటీసుల జారీ
  • స్పీకర్ ఇచ్చిన రూలింగ్‌ను సవాల్ చేసిన జగన్
  • పాత పిటిషన్‌ను కూడా దీంతో కలపాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ వైసీపీ అధినేత జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

విచారణ సందర్భంగా, ప్రతివాదుల జాబితాలో ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, శాసనసభ కార్యదర్శి ప్రసన్నకుమార్‌కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. కాగా, గతంలో జగన్ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను కూడా ఈ కేసుతో కలిపి విచారించాలని న్యాయస్థానం ఆదేశించడం గమనార్హం.

అసెంబ్లీలో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ జగన్ తొలుత స్పీకర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే, ఆ లేఖపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు రూలింగ్ ఇస్తూ ఆ అభ్యర్థనను తిరస్కరించారు. "ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను తాము ఎలా కల్పిస్తాం?" అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ, అసెంబ్లీ నిబంధనలు ఇందుకు అంగీకరించవని ఆయన స్పష్టం చేశారు.

స్పీకర్ ఇచ్చిన ఈ రూలింగ్‌ను సవాల్ చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష హోదా కల్పించేలా స్పీకర్‌ను ఆదేశించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. 
Jagan Mohan Reddy
Andhra Pradesh Assembly
Opposition Leader
Ayyanna Patrudu
Payyavula Keshav
AP High Court
Assembly Speaker
YSRCP

More Telugu News