Haris Rauf: మైదానంలో మాటల యుద్ధం.. గిల్, హరీస్ రౌఫ్ మధ్య తీవ్ర వాగ్వాదం.. వెలుగులోకి వీడియో!

Haris Rauf Shubman Gill Verbal Fight in Asia Cup Match
  • భారత్-పాక్ మ్యాచ్‌లో ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం
  • శుభ్‌మన్ గిల్, హరీస్ రౌఫ్ ఒకరిపై ఒకరు దూసుకెళ్లిన వైనం
  • గొడవను ఆపి, గిల్‌ను శాంతింపజేసిన రింకూ సింగ్
ఆసియా కప్‌లో భాగంగా గత వారం భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాక్ బౌలర్ హరీస్ రౌఫ్, భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ మధ్య మైదానంలోనే తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన తాజా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 పాకిస్థాన్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. ఈ క్రమంలో హరీస్ రౌఫ్ వేసిన ఓవర్ చివరి బంతిని గిల్ బౌండరీకి తరలించాడు. దీంతో అసహనానికి గురైన రౌఫ్‌ను నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న అభిషేక్ శర్మ మాటలతో రెచ్చగొట్టాడు. ఇది సహించని రౌఫ్, అభిషేక్‌పైకి దూసుకెళ్లాడు. వెంటనే గిల్ కూడా కల్పించుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అప్రమత్తమైన అంపైర్లు వారిని విడదీసి గొడవను సద్దుమణిగేలా చేశారు.

అయితే, ఓవర్ ముగియడంతో ప్రసారం వాణిజ్య ప్రకటనలకు మారినప్పటికీ, ఈ గొడవ అక్కడితో ఆగలేదని తాజాగా బయటపడిన వీడియో స్పష్టం చేస్తోంది. డ్రింక్స్ తీసుకుని మైదానంలోకి వచ్చిన రింకూ సింగ్.. కోపంగా ఉన్న గిల్‌ను వారించి పక్కకు తీసుకెళ్లాడు. అతడిని శాంతింపజేస్తూ కొన్ని సూచనలు ఇవ్వడం ఆ వీడియోలో కనిపించింది.

అంతేకాకుండా, ఈ మ్యాచ్‌లో హరీస్ రౌఫ్ తన ప్రవర్తనతో మరో వివాదానికి తెరలేపాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో భారత అభిమానులు గేలి చేస్తుండటంతో, వారి వైపు వేళ్లతో '0-6' అని సైగ చేశాడు. ఈ ఏడాది మే నెలలో సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో ఆరు భారత యుద్ధ విమానాలను కూల్చివేశామని పాకిస్థాన్ చేస్తున్న నిరాధార ప్రచారానికి ఇది సంకేతం. రౌఫ్ చేసిన ఈ సైగల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, భారత అభిమానులు అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ట్రోల్ చేస్తున్నారు. 
Haris Rauf
Shubman Gill
Abhishek Sharma
India vs Pakistan
Asia Cup 2024
cricket controversy
Rinku Singh
Haris Rauf controversy
India Pakistan match
cricket news

More Telugu News