నల్లమల అభయారణ్యంలో 87కు చేరిన పెద్దపులులు

  • 2022లో 74 ఉండగా తాజాగా పెరిగిన సంఖ్య
  • విస్తరించనున్న నాగార్జున సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్
  • శేషాచలం అడవుల వరకు విస్తరించిన పులుల సంచారం
  • నల్లమలలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
  • 2026లో ట్రాప్ కెమెరాలతో మళ్లీ పులుల లెక్కింపు
దట్టమైన నల్లమల అభయారణ్యంలో పెద్దపులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అడవిలో ప్రస్తుతం 87 పులులు సంచరిస్తున్నాయని ప్రాజెక్టు టైగర్‌-మార్కాపురం డిప్యూటీ డైరెక్టర్‌ అబ్దుల్‌ రవూఫ్‌ వెల్లడించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను తెలిపారు.

ప్రతి నాలుగేళ్లకు ఒకసారి పులుల లెక్కింపు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. 2022 జాతీయ గణన నాటికి నల్లమలలో 74 పులులు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 87కి చేరిందని స్పష్టం చేశారు. తదుపరి లెక్కింపును 2026లో ట్రాప్‌ కెమెరాల సహాయంతో నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

పులుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నాగార్జున సాగర్‌-శ్రీశైలం టైగర్‌ రిజర్వ్‌ (ఎన్‌ఎస్‌టీఆర్‌) పరిధిని కూడా త్వరలో విస్తరించనున్నట్లు అబ్దుల్ రవూఫ్ తెలిపారు. నల్లమలలోని పులులు తమ ఆవాసాలను విస్తరించుకుంటూ కడప, అన్నమయ్య, రాయచోటి జిల్లాల మీదుగా శేషాచలం అడవుల వరకు సంచరిస్తున్నాయని చెప్పారు. ఇది వాటి సంఖ్య పెరుగుదలకు, ఆరోగ్యకరమైన వాతావరణానికి నిదర్శనమన్నారు.

వన్యప్రాణుల సంరక్షణకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, పులుల కదలికలను గమనించేందుకు అడవిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. పర్యావరణ పర్యాటకాన్ని (ఎకో టూరిజం) ప్రోత్సహించేందుకు తుమ్మలబైలు, బైర్లూటి, పచ్చర్ల, రోళ్లపాడు వంటి ప్రాంతాల్లో రాత్రి బస చేసేందుకు క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో, వన్యప్రాణులకు హాని తలపెట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ పిచ్చిరెడ్డి, డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ నాగరాజుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


More Telugu News