టీమిండియాను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు: బంగ్లాదేశ్ కోచ్

  • బంగ్లా కోచ్ ఫిల్ సిమ్మన్స్ ధీమా వ్యాఖ్యలు
  • ప్రతి జట్టుకి భారత్‌ను ఓడించే సామర్థ్యం ఉంటుందన్న ఫిల్ సిమ్మన్స్
  • వరుసగా రెండు రోజులు మ్యాచ్‌లు ఇవ్వడం అన్యాయమన్న సిమ్మన్స్
ఆసియా కప్‌ 2025 సూపర్‌-4 దశలో భాగంగా ఈ రోజు (సెప్టెంబర్ 24) బంగ్లాదేశ్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ కోచ్‌ ఫిల్ సిమ్మన్స్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. "టీమిండియాను ఓడించడం అంత కష్టం కాదు. మేము మా ఉత్తమ ఆటతీరును కనబరిస్తే వారిని గెలవగలం," అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో సిమ్మన్స్‌ మాట్లాడుతూ.. “భారత్ ప్రపంచంలో నంబర్ వన్ టీ20 జట్టు కావచ్చు, కానీ మేము గెలవలేమన్నది నిజం కాదు. ప్రతి జట్టుకు భారత్‌ను ఓడించే సామర్థ్యం ఉంటుంది. మేము మా శక్తి మేరకు ఆడితే తప్పులు రాబట్టి, మ్యాచ్‌ను మలుపు తిప్పగలం,” అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, “మేము శ్రీలంకను ఓడించేందుకు మాత్రమే కాదు, ఆసియా కప్‌ టైటిల్ గెలవడానికి వచ్చాం. బలమైన జట్లను ఢీకొట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నాం,” అంటూ విశ్వాసం వ్యక్తం చేశారు.

బ్యాక్‌ టు బ్యాక్‌ మ్యాచ్‌లపై ఆవేదన

బంగ్లాదేశ్‌ జట్టు బుధవారం భారత్‌తో, మరుసటి రోజు (సెప్టెంబర్‌ 25) పాకిస్తాన్‌తో తలపడనుంది. వరుసగా రెండు రోజులు మ్యాచ్‌లు ఇవ్వడం అన్యాయమని సిమ్మన్స్‌ అభిప్రాయపడ్డారు.

“ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ మ్యాచ్‌లు జరగడం వల్ల ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఏ జట్టుకైనా అసమంజసం” అని ఆయన వ్యాఖ్యానించారు.

శ్రీలంకపై గెలుపుతో ఉత్సాహం

బంగ్లాదేశ్‌ జట్టు సూపర్‌-4లో శ్రీలంకపై 3 వికెట్ల తేడాతో గెలిచి దూసుకెళ్తోంది. చివరి ఓవర్‌లో లక్ష్యాన్ని ఛేదించిన ఆ జట్టు, ఇప్పుడు భారత్‌తో జరగబోయే కీలక పోరుకు పూర్తి ఉత్సాహంతో సిద్ధమవుతోంది.

భారత అభిమానుల స్పందన

సిమ్మన్స్ వ్యాఖ్యలపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఆయన ధైర్యాన్ని ప్రశంసిస్తుండగా, మరికొందరు "మాటల కన్నా మ్యాచులో చూపించాలి" అంటూ బదులిస్తున్నారు. 


More Telugu News