తీవ్ర ఆర్థిక సంక్షోభంలో బంగ్లాదేశ్!

  • బంగ్లాదేశ్‌ను ముంచేస్తున్న అప్పులు
  • పతనం అంచున ఆర్థిక వ్యవస్థ
  • దివాలా బాటలో బంగ్లా బ్యాంకులు
  • ఐదు ఇస్లామిక్ బ్యాంకులను విలీనం చేయాలని ప్రభుత్వ నిర్ణయం
పొరుగు దేశం బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. భారీ ఎత్తున పేరుకుపోయిన మొండి బకాయిలతో దేశ బ్యాంకింగ్ రంగం కుప్పకూలే స్థితికి చేరగా, నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌ఐ) దివాలా అంచున నిలిచాయి. మరోవైపు, స్టాక్ మార్కెట్లో నమోదైన అనేక కంపెనీల షేర్లు వాటి ముఖ విలువ కంటే తక్కువకు పడిపోయాయి. ఆసియాలోనే అత్యధిక మొండి బకాయిలు బంగ్లాదేశ్‌లోనే ఉన్నాయని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఇటీవలే నివేదించడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.

బంగ్లాదేశ్ బ్యాంక్ తాజా గణాంకాల ప్రకారం, వాణిజ్య బ్యాంకుల మొండి బకాయిలు జూన్ నాటికి దాదాపు 6 లక్షల కోట్ల టాకాలుగా ఉన్నాయి. దీనికి అదనంగా, మరో 3.18 లక్షల కోట్ల టాకాల రహస్య బకాయిలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మొత్తం పంపిణీ చేసిన రుణాలలో 20.2 శాతం మొండి బకాయిలుగా మారాయి. ఇది గతేడాదితో పోలిస్తే 28 శాతం అధికం. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ బ్యాంకింగ్ వ్యవస్థ ఆసియాలోనే అత్యంత బలహీనంగా ఉందని ఏడీబీ పేర్కొంది.

బలహీనమైన నియంత్రణ, రాజకీయ జోక్యం, అవినీతి ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. "రాజకీయ జోక్యం ఆగి, న్యాయవ్యవస్థను బలోపేతం చేసే వరకు ఈ సమస్య పరిష్కారం కాదు" అని సౌత్ ఏషియన్ నెట్‌వర్క్ ఆన్ ఎకనామిక్ మోడలింగ్ (శామ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సెలమ్ రైహాన్ అన్నారు.

పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. తీవ్ర నష్టాల్లో ఉన్న ఐదు ఇస్లామిక్ బ్యాంకులను (ఫస్ట్ సెక్యూరిటీ, సోషల్ ఇస్లామీ, గ్లోబల్ ఇస్లామీ, యూనియన్, ఎగ్జిమ్ బ్యాంక్) కలిపి "యునైటెడ్ ఇస్లామీ బ్యాంక్" అనే కొత్త ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ బ్యాంకుల మొండి బకాయిలు 48 నుంచి 98 శాతం వరకు ఉన్నాయి. వీటిని ఆదుకునేందుకు ప్రభుత్వం కనీసం 20,000 కోట్ల టాకాలను మూలధనంగా అందించనుంది. మరోవైపు, ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో, టాప్ 20 ఎగవేతదారుల నుంచి కేవలం 219 కోట్ల టాకాలను మాత్రమే రికవరీ చేయగలిగారు.

బ్యాంకింగ్ రంగ సంక్షోభం ప్రభావం నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలపై మరింత తీవ్రంగా ఉంది. 20 సంస్థల మొండి బకాయిలు 21,462 కోట్ల టాకాలుగా ఉన్నాయి, ఇది వాటి మొత్తం రుణాల్లో 83 శాతం. వీటిలో తొమ్మిదింటిని మూసివేయాలని సెంట్రల్ బ్యాంక్ సిఫార్సు చేసింది. డిపాజిటర్లకు డబ్బు తిరిగి చెల్లించలేని స్థితిలో అనేక సంస్థలు ఉండటంతో ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది.

స్టాక్ మార్కెట్ కూడా దాదాపు 38 శాతం క్షీణించింది. ఢాకా స్టాక్ ఎక్స్ఛేంజ్ (డీఎస్‌ఈ) ప్రకారం, లిస్ట్ అయిన 397 కంపెనీలలో 98 కంపెనీల షేర్లు వాటి ముఖ విలువ కంటే తక్కువ ధరకు ట్రేడ్ అవుతున్నాయి. బలహీనమైన కంపెనీలను మార్కెట్ నుంచి తొలగించి, బలమైన వాటిని ప్రోత్సహించాలని డీఎస్‌ఈ బ్రోకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సైఫుల్ ఇస్లాం అభిప్రాయపడ్డారు.


More Telugu News