Paneer: ప్రోటీన్ కోసం పన్నీర్ తింటున్నారా?.. ఈ పొరపాటు అస్సలు చేయొద్దు!

Paneer Side Effects Daily Consumption Health Risks
  • రోజూ పన్నీర్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్న నిపుణులు
  • అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం
  • బయట దొరికే పన్నీర్ నాణ్యతపై పలు సందేహాలు
  • మధుమేహం, పీసీఓఎస్ ఉన్నవారికి మరింత ప్రమాదం
  • మితంగా, ఇంట్లో తయారుచేసుకున్నదే ఉత్తమం
భారతీయుల వంటగదిలో, ముఖ్యంగా శాకాహారులకు పన్నీర్ ఒక సూపర్ ఫుడ్. ప్రోటీన్ కోసం చాలామంది రోజూ తమ ఆహారంలో దీనిని భాగం చేసుకుంటారు. అయితే, రోజూ పన్నీర్ తినడం ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు వల్ల ఊహించని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు.


ముంబైకి చెందిన క్లినికల్ న్యూట్రిషనిస్ట్ ప్రాచీ మంధోలియా ప్రకారం.. రోజూ పన్నీర్ తినడం వల్ల ఎదురయ్యే మొదటి సమస్య అజీర్తి, కడుపు ఉబ్బరం. పన్నీర్ ‌లోని లాక్టోజ్, కేసిన్ అనే ప్రొటీన్‌లను జీర్ణం చేసుకోవడంలో చాలామందికి ఇబ్బంది ఉంటుందని, ఇది కడుపులో అసౌకర్యానికి దారితీస్తుందని తెలిపారు.

ప్రస్తుతం మార్కెట్లో లభించే పాలు, వాటి నాణ్యత కూడా ఆందోళన కలిగించే మరో ముఖ్య విషయం. పాల ఉత్పత్తిలో రసాయనాలు, హార్మోన్ల వాడకం వల్ల అవి కలుషితమవుతున్నాయని, అలాంటి పాలతో చేసిన పన్నీర్ ‌ను రోజూ తినడం వల్ల శరీరంలోకి అనవసరమైన రసాయనాలు, సంతృప్త కొవ్వులు చేరతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక రెస్టారెంట్లలో నాసిరకమైన పామాయిల్ వంటి వాటితో పన్నీర్ వంటకాలు తయారుచేయడం వల్ల జీర్ణవ్యవస్థపై మరింత భారం పడుతుందని వారు తెలిపారు.

పాలు వాపు (ఇన్‌ఫ్లమేషన్)ను ప్రేరేపించే గుణం కలిగి ఉండటం వల్ల రోజూ పన్నీర్ తినడం జీర్ణవ్యవస్థ, కాలేయం, ఇన్సులిన్ పనితీరుపై ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా మధుమేహం, ఫ్యాటీ లివర్, అధిక కొలెస్ట్రాల్, పీసీవోఎస్ వంటి సమస్యలతో బాధపడేవారు రోజూ పన్నీర్ తీసుకుంటే వారి ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని ప్రాచీ మంధోలియా హెచ్చరించారు.

మరి ఎలా తినాలి?
పన్నీర్‌ను పూర్తిగా దూరం పెట్టాల్సిన అవసరం లేదని, మితంగా తీసుకుంటే ప్రయోజనాలు ఉన్నాయని ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ నిశేతా భాటియా తెలిపారు. కండరాల నిర్మాణానికి, ఎముకల బలానికి కావాల్సిన కాల్షియం పన్నీర్ ద్వారా లభిస్తుందన్నారు. తక్కువ కొవ్వు ఉన్న పాలతో ఇంట్లోనే పన్నీర్ తయారు చేసుకోవడం ఉత్తమమని సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ సుహానీ జైన్ సూచించారు. పన్నీర్‌ను కూరగాయలతో కలిపి తీసుకోవాలని, గ్రిల్డ్ లేదా తందూరీ పన్నీర్ వంటివి మంచివని, వేయించిన పన్నీర్ వంటకాలకు, రెస్టారెంట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని ఆమె సలహా ఇచ్చారు. ఆహారంలో వైవిధ్యం పాటించడం ఆరోగ్యానికి ఎంతో కీలకమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Paneer
Paneer side effects
Paneer benefits
Protein
Lactose intolerance
Saturated fats
Pachi Mandholia
Nisheta Bhatia
Suhani Jain
Healthy diet

More Telugu News