Nara Lokesh: వైసీపీ హయాంలోనే రూ.4వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు: మంత్రి లోకేశ్‌

Nara Lokesh Slams YSRCP Over 4000 Crore Fee Reimbursement Dues
  • ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై శాసనమండలిలో వాడివేడి చర్చ
  • గత ప్రభుత్వం రూ.4000 కోట్ల బకాయిలు పెట్టిందన్న మంత్రి లోకేశ్
  • వైసీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మండలి ఛైర్మన్
  • కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.1200 కోట్లు విడుదల చేశామని వెల్లడి
  • మిగిలిన బకాయిలు 3 నెలల్లో చెల్లిస్తామని హామీ
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై ఏపీ శాసనమండలిలో వాడివేడి చర్చ జ‌రిగింది. గత వైసీపీ ప్రభుత్వం ఏకంగా రూ.4,000 కోట్లు బకాయి పెట్టి, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతోందని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ కోరుతూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించడంతో సభలో గందరగోళం మొదలైంది.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... వైసీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.4,000 కోట్లకు చేరాయి. కోవిడ్ సమయంలో రూ.644 కోట్లు, ఆర్టీఎఫ్ కింద రూ.3,000 కోట్లు, ఎంటీఎఫ్ కింద మరో రూ.895 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. ఇంత భారీ మొత్తంలో బకాయిలు పెట్టిన మీరు ఇప్పుడు ఎలా మాట్లాడతారు?" అని నిలదీశారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024-25 సంవత్సరానికి గాను ఇప్పటికే రూ.1,200 కోట్లు విడుదల చేసిందని, మిగిలిన రూ.1,400 కోట్ల బకాయిలను రాబోయే మూడు నెలల్లోగా చెల్లిస్తామని స్పష్టం చేశారు.

ఈ అంశంపై చర్చకు పట్టుబట్టిన వైసీపీ మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణపై లోకేశ్ విరుచుకుపడ్డారు. బీఏసీ సమావేశంలో ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. తమ డొల్లతనం బయటపడుతుందనే భయంతోనే అక్కడ ఈ విషయం లేవనెత్తలేదని ఆరోపించారు. విద్యా రంగంపై ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. గతంలో విద్యా రంగంపై చర్చ జరుగుతుంటే బొత్స సహా ఇతర వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. వైసీపీ హయాంలో సుమారు 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని, దీనిపైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని, సరైన ఫార్మాట్‌లో రావాలని సూచించారు.

ఈ క్రమంలో బొత్స స్పందిస్తూ, సభలో పరుషపదాలు వాడొద్దని సూచించారు. దీనికి లోకేశ్ బదులిస్తూ.. తాను ఎవరినీ అగౌరవపరచలేదని, "బొత్స గారు" అనే సంబోధించానని స్పష్టం చేశారు. ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదని, తాను వాడిన పరుషపదజాలం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను అందరినీ గౌరవిస్తానని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు.
Nara Lokesh
AP Legislative Council
Fee Reimbursement
Botsa Satyanarayana
YSRCP
Andhra Pradesh Education
Student Dues
Education Budget
AP Politics
Nara Lokesh Speech

More Telugu News