DK Shivakumar: ప్రధాని ఇంటి ముందు కూడా గుంతలు.. మీడియా మాత్రం కర్ణాటకనే చూపిస్తోంది: డీకే శివకుమార్

DK Shivakumar says potholes exist even in front of PMs house
  • బెంగళూరు గుంతల సమస్యపై స్పందించిన డీకే శివకుమార్
  • ఇది దేశవ్యాప్త సమస్య అని, కర్ణాటకను టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం
  • భారీ వర్షాల్లోనూ రోజుకు వేల గుంతలు పూడుస్తున్నామని వెల్లడి
  • రోడ్ల మరమ్మతులకు రూ.1,100 కోట్లు కేటాయించినట్లు ప్రకటన
బెంగళూరు నగరంలోని అధ్వాన రోడ్లపై వెల్లువెత్తుతున్న విమర్శలను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గట్టిగా తిప్పికొట్టారు. ఈ సమస్య ఒక్క బెంగళూరుకే పరిమితం కాదన్న ఆయన, దేశ రాజధాని ఢిల్లీని ఉదాహరణగా చూపించారు. నిన్న విలేకరులతో మాట్లాడుతూ "నిన్న నేను ఢిల్లీలో పర్యటించాను. ప్రధానమంత్రి నివాసం ఉండే రోడ్డులోనే ఎన్ని గుంతలు ఉన్నాయో మీడియా గమనించాలి" అని వ్యాఖ్యానించారు.

రోడ్లపై గుంతలు ఉండటం దేశవ్యాప్త సమస్య అని, కానీ మీడియా మాత్రం కేవలం కర్ణాటకను లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. "దేశమంతటా ఇదే పరిస్థితి ఉంది. గతంలో బీజేపీ ప్రభుత్వం సరిగ్గా పనిచేసి ఉంటే రోడ్లు ఎందుకిలా ఉంటాయి?" అని ఆయన ప్రశ్నించారు. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ, తమ సిబ్బంది ప్రతిరోజూ వేలాది గుంతలను పూడ్చివేస్తూనే ఉన్నారని శివకుమార్ స్పష్టం చేశారు.

టెక్ హబ్ అయిన బెంగళూరు 'గుంతల నగరంగా' మారిపోయిందంటూ ఇటీవల కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి విమర్శించిన విషయం తెలిసిందే. దీనికి తోడు, రోడ్లు సరిగా లేవనే కారణంతో 'బ్లాక్‌బక్' అనే లాజిస్టిక్స్ సంస్థ ఔటర్ రింగ్ రోడ్ నుంచి తమ కార్యకలాపాలను మార్చుకుంటామని ప్రకటించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

అయితే, కంపెనీల బెదిరింపులను, బ్లాక్‌మెయిలింగ్‌లను తాము ఏమాత్రం పట్టించుకోమని గతవారమే శివకుమార్ స్పష్టం చేశారు. నగరాన్ని బాగుపరిచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా రోడ్ల మరమ్మతులు, నిర్మాణం కోసం రూ.1,100 కోట్లు కేటాయించినట్లు ఆయన ప్రకటించారు. నవంబర్ లోగా గుంతలన్నింటినీ పూడ్చివేయాలని కాంట్రాక్టర్లకు తుది గడువు విధించినట్లు తెలిపారు. స్వచ్ఛమైన బెంగళూరు, సాఫీగా సాగే ట్రాఫిక్ తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
DK Shivakumar
Karnataka
Bangalore roads
Delhi roads
Potholes
Road repairs
HD Kumaraswamy
Blackbuck logistics
Karnataka government
Road infrastructure

More Telugu News