శాకాహారినైన నాతో చికెన్ తినిపించారు... ఫుడ్ డెలివరీ సంస్థపై నటి సాక్షి అగర్వాల్ ఫైర్

  • సినీ నటి సాక్షి అగర్వాల్ కు చేదు అనుభవం
  • పుట్టినప్పటి నుంచి తాను పూర్తి శాకాహారినన్న సాక్షి
  • తెలియకుండా తనతో చికెన్ తినిపించారని తీవ్ర ఆవేదన
తమిళ నటి సాక్షి అగర్వాల్‌కు ఓ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా ఊహించని, చేదు అనుభవం ఎదురైంది. తాను ఆర్డర్ చేసిన పనీర్ కర్రీలో చికెన్ ముక్కలు రావడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, సదరు రెస్టారెంట్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

వివరాల్లోకి వెళితే... ఇటీవల బాగా ఆకలిగా ఉండటంతో, సాక్షి అగర్వాల్ స్విగ్గీ ద్వారా ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి పనీర్ వంటకాన్ని ఆర్డర్ చేశారు. అయితే, డెలివరీ వచ్చిన తర్వాత తినడం మొదలుపెట్టగా, అందులో పనీర్‌తో పాటు చికెన్ ముక్కలు కూడా ఉండటాన్ని గమనించి షాక్‌కు గురయ్యారు. తాను పుట్టినప్పటి నుంచి పూర్తి శాకాహారినని, అలాంటి తనతో బలవంతంగా మాంసాహారం తినిపించినట్లయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సంఘటనపై ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. "జీవితంలో ఎప్పుడూ మాంసాహారం ముట్టని నాకు ఇలాంటి అనుభవం ఎదురవ్వడం దారుణం. ఆహారం విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా, ఒక శాకాహారికి చికెన్ పంపడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీశారు" అని సదరు రెస్టారెంట్‌పై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

సాక్షి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంతో మంది నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తూ, రెస్టారెంట్ నిర్లక్ష్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఫుడ్ డెలివరీ సంస్థలు, రెస్టారెంట్లు ఇలాంటి సున్నితమైన విషయాల్లో మరింత బాధ్యతగా వ్యవహరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.



More Telugu News