నవరాత్రులకు కేంద్రం కానుక.. మరో 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు

  • నవరాత్రుల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
  • ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద కొత్త కనెక్షన్లు
  • దేశవ్యాప్తంగా 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ
  • 10.60 కోట్లకు చేరనున్న మొత్తం ఉజ్వల కుటుంబాలు
  • ప్రతి కనెక్షన్‌పై రూ. 2,050 భరించనున్న ప్రభుత్వం
పవిత్రమైన నవరాత్రులను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మహిళలకు శుభవార్త అందించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకంలో భాగంగా మరో 25 లక్షల కొత్త ఎల్పీజీ కనెక్షన్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దేశంలో మొత్తం ఉజ్వల లబ్ధిదారుల సంఖ్య 10.60 కోట్లకు చేరుకోనుంది.

ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ సోమవారం తన ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించారు. పండుగ సీజన్‌లో పేద కుటుంబాలకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం జారీ చేసే ప్రతి కొత్త ఉచిత కనెక్షన్‌ కోసం సుమారు రూ. 2,050 ఖర్చు చేయనుందని ఆయన వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ మాట్లాడుతూ, "ప్రధాని నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ మహిళల గౌరవానికి, సాధికారతకు పెద్దపీట వేస్తారు. దుర్గాదేవిని పూజించే ఈ శుభ సమయంలో 25 లక్షల కొత్త ఉజ్వల కనెక్షన్లు ఇవ్వడం మహిళల పట్ల ఆయనకున్న గౌరవానికి మరో నిదర్శనం" అని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.


More Telugu News