కేరళలో దారుణం.. స్నానం చేస్తుండగా భార్యను నరికి చంపి ఫేస్‌బుక్‌లైవ్‌లో నేరాన్ని అంగీకరించాడు!

  • కొల్లం జిల్లా పునలూర్‌లో సంఘటన
  • కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్న భార్యాభర్తలు
  • తన తల్లి వద్ద ఉంటున్న భార్య వద్దకు వచ్చి హత్య చేసిన భర్త
  • ఫేస్‌బుక్‌లో నేరాన్ని అంగీకరించి, పోలీసుల ఎదుట లొంగుబాటు
కేరళకు చెందిన వ్యక్తి భార్యను దారుణంగా హత్య చేసి, అనంతరం ఫేస్‌బుక్‌లో తన నేరాన్ని అంగీకరించి పోలీసులకు లొంగిపోయాడు. ఈ విషాద సంఘటన కొల్లం జిల్లాలోని పునలూరులో చోటుచేసుకుంది. మృతురాలు షాలిని తన తల్లి వద్ద నివాసం ఉంటోంది. ఆమె స్నానం చేస్తుండగా ఇంట్లోకి చొరబడిన భర్త ఐజాక్ ఆమెపై దాడి చేసి హత్య చేశాడు.

వివరాల్లోకి వెళితే, ఐజాక్ వేధింపులు భరించలేక షాలిని కొంతకాలంగా తన తల్లి వద్ద ఉంటోంది. స్థానికంగా ఉన్న పాఠశాలలో షాలిని కేర్‌టేకర్‌‍గా పని చేస్తోంది. ఆమె పాఠశాలకు వెళ్ళడానికి సిద్ధమవుతుండగా ఐజాక్ ఇంట్లోకి ప్రవేశించి పదునైన ఆయుధంతో ఆమెపై దాడి చేశాడు.

ఐజాక్, షాలిని దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. దాడి జరిగిన సమయంలో ఒకరు సంఘటన స్థలంలోనే ఉన్నారు. ఆ చిన్నారి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని షాలిని మరణించినట్లు నిర్ధారించారు. అనంతరం ఐజాక్ అక్కడి నుంచి పారిపోయి ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా తన నేరాన్ని అంగీకరించాడు.

అదే సమయంలో ఐజాక్ తన భార్యపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. షాలిని తనకు తెలియకుండానే బంగారాన్ని తాకట్టు పెట్టిందని, తన పట్ల గౌరవం లేకుండా ప్రవర్తించేదని, విలాసవంతమైన జీవితం కోసం తన తల్లితో కలిసి ఉండాలని కోరుకునేదని ఆరోపించాడు. అంతేకాకుండా తనకు తెలియని సంబంధాలు కూడా ఉన్నాయని రెండున్నర నిమిషాల ఫేస్‌బుక్ లైవ్ వీడియోలో ఆరోపణలు చేశాడు. తన భార్య పిల్లలను సైతం నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఫేస్‌బుక్ లైవ్‌లో తీవ్ర ఆరోపణలు చేసిన అనంతరం ఐజాక్ పునలూరు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉన్నట్లు పోలీసుల గుర్తించారు. వారు కొంతకాలంగా వేర్వేరుగా నివసిస్తున్నారని కూడా పోలీసులు తెలిపారు.


More Telugu News