ఎయిరిండియా విమానంలో కలకలం... కాక్‌పిట్ డోర్ తెరిచేందుకు ప్రయాణికుడి యత్నం

  • బెంగళూరు నుంచి వారణాసి వెళుతున్న విమానంలో ఘటన
  • కాక్‌పిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడు
  • టాయిలెట్ అనుకుని పొరపడినట్టు వెల్లడి
  • మొదటిసారి విమానంలో ప్రయాణిస్తున్నట్టు గుర్తింపు
  • అప్రమత్తమై అడ్డుకున్న విమాన సిబ్బంది
  • వారణాసిలో ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న సీఐఎస్ఎఫ్
బెంగళూరు నుంచి వారణాసికి వెళుతున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సోమవారం తీవ్ర కలకలం రేగింది. ఒక ప్రయాణికుడు గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో కాక్‌పిట్ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించడంతో తోటి ప్రయాణికులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. అయితే, విచారణలో అసలు విషయం తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఐఎక్స్-1086 విమానంలో ప్రయాణిస్తున్న వ్యక్తికి విమాన ప్రయాణం ఇదే మొదటిసారి. ప్రయాణ సమయంలో అతను పొరపాటున టాయిలెట్ కోసం వెతుకుతూ కాక్‌పిట్ డోర్ వద్దకు చేరుకున్నాడు. దానిని టాయిలెట్ డోర్‌గా భావించి తెరవడానికి ప్రయత్నించాడు. సిబ్బంది వెంటనే స్పందించి అది కాక్‌పిట్ అని, అందులోకి ప్రవేశం లేదని సున్నితంగా తెలియజేశారు. దీంతో అతను తన సీటులో కూర్చున్నాడు.

ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని, ఈ ఘటనలో ఎలాంటి భద్రతాపరమైన ముప్పు వాటిల్లలేదని పేర్కొంది. విమానం వారణాసిలో ల్యాండ్ అయిన వెంటనే, ఆ ప్రయాణికుడిని నిబంధనల ప్రకారం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధికారులకు అప్పగించామని, ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోందని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి తెలిపారు.

మరోవైపు, ఆ ప్రయాణికుడు కాక్‌పిట్ డోర్‌కు సరైన పాస్‌కోడ్‌ను ఎంటర్ చేశాడని, హైజాక్ చేసే ప్రయత్నమేమోనన్న అనుమానంతో పైలట్ అడ్డుకున్నాడని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే, ఈ విషయంపై అధికారిక ధృవీకరణ ఇంకా లభించలేదు.


More Telugu News