'ఓజీ'లో ఈ రెండు పాత్రలు హైలైట్ కానున్నాయా?

  • పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన 'ఓజీ'
  • ఈ నెల 25వ తేదీన భారీ రిలీజ్
  • ఆసక్తిని రేకెత్తిస్తున్న అర్జున్ దాస్ - శ్రియా రెడ్డి రోల్స్
  • ఆడియన్స్ లో పెరుగుతున్న అంచనాలు

ఇప్పుడు అందరి దృష్టి పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన 'ఓజీ'పైనే ఉన్నాయి. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకి సుజీత్ దర్శకత్వం వహించాడు. ప్రియాంక మోహన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 25వ తేదీన థియేటర్లకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కొద్దీ ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ పోతున్నాయి. తన సినిమాలలో 'ఖుషీ' తరువాత అభిమానుల్లో ఆ స్థాయి ఉత్సాహాన్ని చూస్తున్నాని పవన్ కల్యాణ్ అనడం ఇప్పుడు ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఈ సినిమాలో కీలకమైన పాత్రలలో ప్రకాశ్ రాజ్ .. ఇమ్రాన్ హష్మీ .. అర్జున్ దాస్ .. శ్రియా రెడ్డి కనిపించనున్నారు. ఈ నాలుగు పాత్రలు ఈ సినిమాలో బలమైనవిగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. అయితే అర్జున్ దాస్ .. శ్రియా రెడ్డి పాత్రలపై ఆడియన్స్ ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ ఉండటం విశేషం. అర్జున్ దాస్ బేస్ వాయిస్ కీ .. ఆయన యాక్టింగ్ కి తెలుగులో అభిమానులు ఉన్నారు. ఖైదీ .. బుట్టబొమ్మ వంటి సినిమాలు, తెలుగు ప్రేక్షకులకు ఆయనను మరింత చేరువ చేశాయి. అందువలన ఆయన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండొచ్చని అంతా భావిస్తున్నారు. 


ఇక శ్రియా రెడ్డికి తెలుగు సినిమాలేం కొత్త కాదు. 2003లోనే తెలుగులో ఆమె ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత కూడా కొన్ని తెలుగు సినిమాలు చేసింది. అయితే ఈ మధ్య కాలంలో ఆమె పవర్ ఫుల్ విలనిజాన్ని చూపించిన సినిమా 'సలార్' అనే చెప్పాలి. ఒక సినిమా కోసం ఆమెను తీసుకున్నారనగానే, ఆమె పాత్ర ఎలా ఉంటుందనేది ఆడియన్స్ గెస్ చేస్తారు. అందువలన అలాంటి ఒక టిపికల్ రోల్ ను ఆమె 'ఓజీ'లో చేసి ఉంటుందనేది కుతూహలాన్ని రేకెత్తిస్తోంది. అటు అర్జున్ దాస్ .. ఇటు శ్రియా రెడ్డి ఈ సినిమాను ఏ స్థాయికి తీసుకుని వెళతారనేది చూడాలి. 


More Telugu News