చదివింది ఇంటర్, మోసాల్లో మాత్రం పీహెచ్ డి.. చిత్తూరు యువకుడి నిర్వాకం

  • ఉపాధి కోసం సెల్ ఫోన్ రిపేర్ షాపు.. జల్సాల కోసం మోసావతారం
  • ఏకంగా బెట్టింగ్ యాప్ తయారు చేయించుకుని కోట్లు కాజేసిన వైనం
  • నగదు పెట్టుబడి పెడితే రెట్టింపు అవుతుందంటూ చీటింగ్
చిత్తూరు జిల్లాలో బెట్టింగ్ యాప్ తో మోసాలకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆన్ లైన్ లో బెట్టింగ్ దందా చేస్తూ పలువురి మరణాలకు కారణమయ్యాడని, అమాయకులను మోసం చేసి కోట్లు కొల్లగొట్టాడని ఆరోపించారు. అయితే, సదరు యువకుడు కేవలం ఇంటర్ మాత్రమే పూర్తిచేసి సెల్ ఫోన్ దుకాణం నిర్వహిస్తుండడం చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. చదివింది తక్కువే అయినా మోసాల్లో మాత్రం ఆరితేరాడని వ్యాఖ్యానించారు.

వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన బెస్త చందు(32) స్థానికంగా చిన్న మొబైల్‌ దుకాణం నడిపిస్తూ క్రికెట్ బెట్టింగ్ లు కాస్తుండేవాడు. తర్వాత తనే ఓ యాప్ తయారు చేయించుకుని రాధా ఎక్స్ఛేంజ్‌ పేరుతో బెట్టింగ్ దందా స్టార్ట్ చేశాడు. నగదు పెట్టుబడిని తక్కువ కాలంలోనే రెట్టింపు చేస్తామని అమాయకులను ప్రలోభపెట్టాడు. ముఖ్యంగా యువతను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడ్డాడు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా చందు వలలో పడి మోసపోయారు.

నేలపల్లెకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఈ యాప్ లో రూ.70 లక్షలు పోగొట్టుకున్నాడు. దీనిపై ఆయన పోలీసులను ఆశ్రయించగా.. వారు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసి చందు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. అయితే, తాజాగా ఈ యాప్ బారిన పడి రూ.2 లక్షలు పోగొట్టుకున్నానంటూ రాయలపేటకు చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు. చందుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు.. మొత్తం 11 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. దర్యాప్తులో భాగంగా ఆదివారం సాయంత్రం చందూను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

జనాలను దోచి జల్సా జీవితం..
బెట్టింగ్‌ యాప్‌ ద్వారా వచ్చిన అక్రమార్జనతో బెంగళూరు, తిరుపతి, హైదరాబాద్, చిత్తూరు తదితర నగరాల్లో చందు విలాసవంతమైన భవంతులు, స్థలాలు కొనుగోలు చేశాడు. సొంతూరిలో ఖరీదైన భవనం నిర్మించి అందులో ఫేస్‌లాక్‌ సిస్టం, ఖరీదైన ఫర్నీచర్ వంటి అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఖరీదైన ల్యాప్‌టాప్‌ లు, మొబైళ్లు, రూ.70 లక్షల ఖరీదైన ఎలక్ట్రిక్‌ కారు, పలు ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేశాడు.


More Telugu News