డిజిటల్ అరెస్ట్ పేరుతో మాజీ బ్యాంకర్‌నే బోల్తా కొట్టించారు.. రూ 23 కోట్లు కాజేశారు!

  • ఢిల్లీలో 78 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకర్‌కు బురిడీ
  • నెల రోజుల వ్యవధిలో రూ.23 కోట్లు కాజేసిన కేటుగాళ్లు
  • సీబీఐ, ఈడీ అధికారులమంటూ ఫోన్ కాల్స్‌తో బెదిరింపులు
  • 'డిజిటల్ అరెస్ట్' పేరుతో ఇంట్లోనే బాధితుడి నిర్బంధం
  • కుటుంబ సభ్యులకు హాని చేస్తామని హెచ్చరించి డబ్బుల వసూలు
  • దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు, రూ.2.3 కోట్ల ఫ్రీజ్
దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత సంచలనం రేపిన భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. 'డిజిటల్ అరెస్ట్' పేరుతో ఓ వృద్ధుడిని నెల రోజుల పాటు ఇంట్లోనే బంధించిన కేటుగాళ్లు, ఏకంగా రూ.23 కోట్లు కాజేశారు. సీబీఐ, ఈడీ వంటి ఉన్నత దర్యాప్తు సంస్థల అధికారులమని నమ్మించి ఈ భారీ మోసానికి పాల్పడటం గమనార్హం. ఈ ఘటన సైబర్ నేరాల తీవ్రతకు అద్దం పడుతోంది.

దక్షిణ ఢిల్లీలోని గుల్మొహర్ పార్క్‌లో నివసించే 78 ఏళ్ల నరేశ్ మల్హోత్రా అనే రిటైర్డ్ బ్యాంకర్‌కు గత నెలలో ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాను ప్రముఖ టెలికం కంపెనీ సీనియర్ అధికారినని పరిచయం చేసుకున్న ఓ మహిళ, ఆయన మొబైల్ నంబర్‌ను చట్టవిరుద్ధ కార్యకలాపాలకు వాడుతున్నారని చెప్పింది. ఈ విషయంపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని నమ్మబలికింది. ఆ తర్వాత, ముంబై పోలీస్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులమంటూ పలువురు ఆయనకు ఫోన్లు చేయడం ప్రారంభించారు.

ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 4 మధ్య నెల రోజుల పాటు మల్హోత్రాను 'డిజిటల్ అరెస్ట్'లో ఉంచారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి వీడియో కాల్‌లో హాజరు కావాలని ఆదేశించారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని, రహస్యంగా ఉంచుతామని ఓ అండర్‌టేకింగ్ పత్రంపై సంతకం కూడా చేయించుకున్నారు. ఆయన పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నామని, దేశం విడిచి వెళ్లలేరని బెదిరించారు. ఆయన బ్యాంకు ఖాతాలకు టెర్రర్ గ్రూపులతో సంబంధాలున్నాయని భయపెట్టి, ఆయన బ్యాంకు, పెట్టుబడుల వివరాలను సేకరించారు.

మోసగాళ్ల మాటలు నమ్మిన మల్హోత్రా వారు చెప్పినట్లుగా దాదాపు 20 లావాదేవీల ద్వారా తన మూడు బ్యాంకు ఖాతాల నుంచి సుమారు రూ.23 కోట్లను బదిలీ చేశారు. డబ్బు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులకు హాని చేస్తామని కూడా నిందితులు బెదిరించినట్లు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. చివరకు మోసపోయానని గ్రహించిన ఆయన, ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్ఎస్‌వో) విభాగాన్ని ఆశ్రయించారు.

ఈ ఘటనపై సెప్టెంబర్ 19న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు బదిలీ అయిన నిధుల్లో సుమారు రూ.2.3 కోట్లను ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై ఐఎఫ్ఎస్ఓ జాయింట్ సీపీ రజనీశ్ గుప్తా మాట్లాడుతూ "ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉంది" అని వెల్లడించారు.


More Telugu News