సీఎంగా పని చేసిన జగన్ కు నిబంధనలు తెలియవా?: రఘురామకృష్ణరాజు

  • అసెంబ్లీ బహిష్కరణపై జగన్‌ను టార్గెట్ చేసిన అధికారపక్షం
  • 60 రోజులు సభకు రాకపోతే సభ్యత్వం రద్దవుతుందన్న రఘురామ
  • ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చే బిస్కెట్ కాదన్న అనిత
వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడంపై అధికారపక్ష నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష హోదా అనేది అడిగితే ఇచ్చే చాక్లెట్ కాదని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేయగా, సభకు వరుసగా 60 రోజులు గైర్హాజరైతే సభ్యత్వం రద్దవుతుందనే నిబంధన జగన్‌కు తెలియదా? అని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. 

పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలో రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, "గతంలో ఎంపీగా, ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్‌కు శాసనసభ నిబంధనలు తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది" అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం, సభాపతి అనుమతి లేకుండా వరుసగా 60 రోజుల పాటు సమావేశాలకు హాజరుకాని సభ్యుడు అనర్హుడు అవుతాడని ఆయన స్పష్టం చేశారు. ఇదే విషయం అసెంబ్లీ నిబంధనావళిలోని క్లాజ్ 187(2)లో కూడా ఉందని, ఈ రూల్స్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని, వైసీపీ నేతలు వాటిని పరిశీలించాలని సూచించారు. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులకు రెండు ప్రశ్నలు కేటాయిస్తున్నా, వారు సభలో ఉండటం లేదని ఆయన తెలిపారు.

మరోవైపు ఒంగోలులో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, "ప్రతిపక్ష హోదా అనేది చాక్లెట్టో, బిస్కెట్టో కాదు.. చిన్నపిల్లాడిలా మారాం చేయగానే ఇవ్వడానికి. అది ప్రజలు ఇవ్వాలి" అని అన్నారు. జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఒక్కసారి కూడా 'అధ్యక్షా' అని మాట్లాడే భాగ్యాన్ని కోల్పోయారని ఆమె విమర్శించారు. గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఒక్కరే సభ నుంచి బయటకు వెళ్లినా, టీడీపీ ఎమ్మెల్యేలంతా సభలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడారని గుర్తు చేశారు. ప్రస్తుతం జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని, ఆ హోదాలోనే సభలో మాట్లాడాలని అనిత స్పష్టం చేశారు. 


More Telugu News