పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం.. ఒకే ఇన్నింగ్స్‌తో రికార్డుల మోత

  • ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌కు 6 వికెట్ల తేడాతో ఘన విజయం
  • విజయంలో కీలక పాత్ర పోషించిన యువ ఓపెనర్ అభిషేక్ శర్మ
  • కేవలం 39 బంతుల్లో 74 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్
  • టీ20ల్లో అత్యంత వేగంగా 50 సిక్సర్లు.. ప్రపంచ రికార్డు సమం
  • టీ20ల్లో ఇన్నింగ్స్ తొలి బంతికి రెండుసార్లు సిక్సర్ కొట్టిన తొలి భారత ఆటగాడిగా అభిషేక్
ఆసియా కప్ 2025 సూపర్ ఫోర్ దశలో టీమిండియా యువ సంచలనం అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో చరిత్రాత్మక ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. తన గురువు యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొడుతూ, కేవలం 24 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. అభిషేక్ సృష్టించిన విధ్వంసానికి భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఆదివారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 25 ఏళ్ల అభిషేక్ శర్మ తన విశ్వరూపం చూపించాడు. ఆరంభం నుంచే పాక్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి కేవలం 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 74 పరుగులు సాధించాడు. ఈ టోర్నమెంట్‌లో వరుసగా ముప్పై పరుగుల వద్ద ఔటవుతూ వస్తున్న గండాన్ని దాటి, కీలక మ్యాచ్‌లో అద్భుతమైన అర్ధశతకాన్ని నమోదు చేశాడు.

అభిషేక్ ఖాతాలో పలు అరుదైన రికార్డులు
ఈ ఇన్నింగ్స్‌తో అభిషేక్ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన 14 నెలల్లోనే, కేవలం 20వ ఇన్నింగ్స్‌లోనే 50 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఎవిన్ లూయిస్ ప్రపంచ రికార్డును సమం చేశాడు. అంతేగాక‌ ఆడిన బంతుల పరంగా చూస్తే (331 బంతుల్లో) ప్రపంచంలోనే అత్యంత వేగంగా 50 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఎవిన్ లూయిస్ 366 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు.

ఇన్నింగ్స్ తొలి బంతికే షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో సిక్సర్ బాది అభిషేక్ మరో రికార్డు నెలకొల్పాడు. అఫ్రిది తన కెరీర్‌లో ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేయడం ఇది 70వ సారి కాగా, అతని తొలి బంతికి సిక్సర్ ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. అలాగే, టీ20ల్లో ఇన్నింగ్స్ తొలి బంతికి రెండుసార్లు సిక్సర్ కొట్టిన తొలి భారత ఆటగాడిగానూ అభిషేక్ నిలిచాడు. ఇంతకుముందు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ ఈ ఘనతను ఒక్కోసారి సాధించారు. పాకిస్థాన్‌పై అత్యంత వేగవంతమైన అర్ధశతకం (29 బంతులు) సాధించిన యువరాజ్ సింగ్ రికార్డును అభిషేక్ తన మెరుపు ఇన్నింగ్స్‌తో చెరిపేశాడు.


More Telugu News