భారత్ తో నాలుగు యుద్ధాలు చేశాం... కానీ!: పాక్ ప్రధాని షెహబాజ్

  • కశ్మీర్ సమస్య తేలకుండా భారత్‌తో సత్సంబంధాలు అసాధ్యమన్న షెహబాజ్ 
  • భారత్ సహకరించాల్సింది పోయి యుద్ధ వైఖరి అవలంబిస్తోందని విమర్శ
  • కశ్మీర్ అంశాన్ని గాజాలో జరుగుతున్న యుద్ధంతో పోల్చిన పాక్ ప్రధాని
  • గత యుద్ధాలతో బిలియన్ల డాలర్లు నష్టపోయామని ఆవేదన
కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించకుండా భారత్‌తో సాధారణ సంబంధాలు సాధ్యమవుతాయని ఎవరైనా అనుకుంటే, అది పగటి కలలు కనడమే అవుతుందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి సమావేశాలకు హాజరయ్యే ముందు లండన్‌లో ఆయన ప్రవాస పాకిస్థానీలతో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనాలంటే కశ్మీర్ అంశాన్ని తేల్చాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

"భారత్, పాకిస్థాన్ పొరుగు దేశాలు. మనం కలిసే జీవించాలి. కానీ కశ్మీరీ ప్రజల త్యాగాలు వృథా కారాదు. వారి రక్తం ప్రవహిస్తున్నంత కాలం శాంతి సాధ్యం కాదు. భారత్ సహకరించే ధోరణిలో కాకుండా యుద్ధ వైఖరితో వ్యవహరిస్తోంది" అని షెహబాజ్ విమర్శించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడిపై అంతర్జాతీయ దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్ చేశారు.

గతంలో భారత్‌తో జరిగిన నాలుగు యుద్ధాల వల్ల తమ దేశం బిలియన్ల కొద్దీ డాలర్లను నష్టపోయిందని షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ డబ్బును పాకిస్థాన్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ఖర్చు చేసి ఉంటే దేశం ఎంతో అభివృద్ధి చెందేదని అన్నారు. "మనం ప్రేమతో, పరస్పర గౌరవంతో జీవించాలా లేక పోరాటాలతోనే కొనసాగాలా అన్నది మన చేతుల్లోనే ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా కశ్మీర్ అంశాన్ని గాజాలో జరుగుతున్న పరిణామాలతో షెహబాజ్ పోల్చారు. గాజాలో 64 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ఇజ్రాయెల్ దురాగతాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కశ్మీర్, గాజా రెండు సమస్యలపైనా అంతర్జాతీయ సమాజం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కాగా, ఉగ్రవాదం, చర్చలు ఏకకాలంలో జరగవని భారత్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.


More Telugu News