దమ్ముంటే ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలి: భూమన

  • తిరుమల పరకామణిలో చోరీ ఆరోపణలను ఖండించిన భూమన
  • సీఐడీతో కాదు, సీబీఐతో దర్యాప్తు జరపాలని ప్రభుత్వానికి సవాల్
  • రవి కుమార్‌కు ఏపీ, కర్ణాటక, తమిళనాడులో ఆస్తులున్నాయని వెల్లడి
  • బినామీలకు ఆస్తులు రాసిస్తే సీబీఐతో విచారణకు సిద్ధమని స్పష్టీకరణ
  • తిరుమలను కూటమి ప్రభుత్వం ఆటస్థలంగా మార్చేసిందని విమర్శ
తిరుమల పరకామణిలో చోరీ జరిగిందంటూ తనపై వస్తున్న ఆరోపణలపై టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేసిన ఆయన, ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే ఈ కేసుపై సీబీఐతో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు.

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, "తిరుమల పరకామణిలో చోరీ జరిగిందని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసును సీఐడీతో కాదు, సీబీఐతో విచారణ జరిపించాలి" అని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తిరుమలను ఒక ఆటస్థలంగా మార్చేసిందని ఆయన ఆరోపించారు.

ఈ సందర్భంగా రవికుమార్ అనే వ్యక్తి ప్రస్తావన తెచ్చిన భూమన, అతనికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయని తెలిపారు. ఒకవేళ తమ బినామీలకు ఆస్తులు రాసిచ్చినట్లు నిరూపిస్తే, దానిపైనా సీబీఐ విచారణ జరపాలని ఆయన స్పష్టం చేశారు. పరకామణి విషయంలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, రాజకీయంగా కక్ష సాధించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.


More Telugu News