భారత్-పాక్ యుద్ధం ఆపింది నేనే.. నాకు నోబెల్ ఇవ్వాలి: ట్రంప్

  • భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానన్న ట్రంప్
  • వాణిజ్యం నిలిపివేస్తానని హెచ్చరించడంతోనే వారు ఆగిపోయారని వ్యాఖ్య
  • ఈ ఘనతకు తనకు నోబెల్ శాంతి బహుమతి రావాలని డిమాండ్
  • ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఏడు యుద్ధాలను ఆపినట్లు వెల్లడి
  • ప్రతిదానికీ ఓ నోబెల్ బహుమతి ఇవ్వాలని ఆసక్తికర వ్యాఖ్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని, ఈ ఘనతకు గానూ తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల‌ని ఆయన అన్నారు. వాణిజ్యాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించి ఈ సంక్షోభానికి తెరదించినట్లు ఆయన పేర్కొన్నారు. శనివారం జరిగిన అమెరికన్ కార్నర్‌స్టోన్ ఇన్‌స్టిట్యూట్ ఫౌండర్స్ డిన్నర్‌లో ట్రంప్ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన హయాంలో ప్రపంచ వేదికపై అమెరికాకు ఎన్నడూ లేనంత గౌరవం లభించిందని ట్రంప్ తెలిపారు. "మేం శాంతి ఒప్పందాలు కుదురుస్తున్నాం, యుద్ధాలను ఆపుతున్నాం. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని మేమే ఆపాం" అని ఆయన స్పష్టం చేశారు. దీన్ని ఎలా సాధించారో వివరిస్తూ, "వాణిజ్యంతోనే దీన్ని ఆపాను. ఇరు దేశాల నేతలంటే నాకు గౌరవం ఉంది. కానీ, 'మీరు యుద్ధానికి దిగితే మేం ఎలాంటి వాణిజ్యం చేయబోం' అని నేను వారికి స్పష్టం చేశాను. వారి వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి. దాంతో వారు యుద్ధం ఆపేశారు" అని ట్రంప్ వివరించారు.

కేవలం భారత్-పాకిస్థాన్ మధ్యే కాకుండా, థాయ్‌లాండ్-కంబోడియా, ఆర్మేనియా-అజర్‌బైజాన్, సెర్బియా-కొసోవో సహా మొత్తం ఏడు యుద్ధాలను తాను ఆపినట్లు ట్రంప్ పేర్కొన్నారు. తాను ఆపిన వాటిలో 60 శాతం వాణిజ్య సంబంధాల ద్వారానే సాధ్యమయ్యాయని ఆయన తెలిపారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపితే నోబెల్ బహుమతి వస్తుందని కొందరు తనతో అన్నారని చెబుతూ, "మరి నేను ఆపిన ఈ ఏడు యుద్ధాల సంగతేంటి? నాకు ప్రతిదానికీ ఒక నోబెల్ బహుమతి రావాలి కదా?" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తనకు మంచి సంబంధాలున్నాయని, అందుకే రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించడం సులభమని తాను భావించానని, ఏదో ఒక విధంగా దాన్ని కూడా పరిష్కరించి తీరతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News