రంగంలోకి భారత ప్రభుత్వం.. హెచ్-1బీ వీసాదారుల కోసం ఎమర్జెన్సీ నంబర్

  • హెచ్-1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన
  • తీవ్ర ఆందోళనలో భారతీయ టెక్ నిపుణులు
  • ఇది కొత్త వీసాలకేనని, ప్రస్తుత వీసాదారులకు వర్తించదని స్పష్టం చేసిన వైట్‌హౌస్
  • భారతీయుల కోసం ఎమర్జెన్సీ సహాయ నంబర్‌ను ప్రకటించిన భారత ఎంబ‌సీ
  • కుటుంబాలపై ప్రభావం చూపుతుందని భారత విదేశాంగ శాఖ ఆందోళన
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ టెక్ నిపుణులకు తీవ్ర ఆందోళన కలిగించే పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాలపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారిపై ఏకంగా 100,000 డాలర్ల (సుమారు రూ. 83 లక్షలు) వార్షిక రుసుమును విధిస్తూ ఒక ప్రకటనపై సంతకం చేశారు. ఈ నిర్ణయం భారతీయ నిపుణులలో కలకలం రేపింది.

ఈ ప్రకటన వెలువడిన వెంటనే వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. తక్షణ సహాయం అవసరమైన భారతీయ పౌరుల కోసం శనివారం ఒక ఎమర్జెన్సీ సహాయ నంబర్‌ను విడుదల చేసింది. "అత్యవసర సహాయం కావాల్సిన వారు 1-202-550-9931 నంబర్‌కు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. సాధారణ వీసా సంబంధిత ప్రశ్నలకు కాకుండా, తక్షణ సహాయం కోసం మాత్రమే ఈ నంబర్‌ను సంప్రదించాలి" అని ఎంబసీ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తెలిపింది.

భారీగా పెంచిన ఈ ఫీజుపై నెలకొన్న గందరగోళంపై వైట్‌హౌస్ స్పష్టతనిచ్చింది. ఈ రుసుము కేవలం కొత్తగా హెచ్-1బీ వీసా కోసం పిటిషన్ దాఖలు చేసేవారికి మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే వీసా కలిగి ఉన్నవారికి లేదా రెన్యూవల్ చేసుకునేవారికి ఇది వర్తించదని ఒక సీనియర్ అధికారి తెలిపారు. "ఇది ఒక్కసారి చెల్లించే ఫీజు. రాబోయే లాటరీ సైకిల్ నుంచి అమల్లోకి వస్తుంది" అని వైట్‌హౌస్ అధికారి ఒకరు ఐఏఎన్ఎస్ వార్తా సంస్థకు ప్రత్యేకంగా వివరించారు.

మరోవైపు, ఈ పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాబోయే పర్యవసానాలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తోంది. ఇది కేవలం ఆర్థికపరమైన అంశమే కాకుండా, ఎన్నో కుటుంబాలపై మానవతా సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

"హెచ్-1బీ వీసాపై ప్రతిపాదిత ఆంక్షలకు సంబంధించిన నివేదికలను ప్రభుత్వం గమనిస్తోంది. దీని పూర్తి ప్రభావంపై భారత పరిశ్రమ వర్గాలతో సహా సంబంధిత అన్ని వర్గాలు అధ్యయనం చేస్తున్నాయి" అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ చర్య వల్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. మొత్తం హెచ్-1బీ వీసాలలో సుమారు 71 శాతం భారతీయులకే మంజూరు అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.


More Telugu News