చిత్తూరులో 'ఓజీ' ఫస్ట్ టికెట్ ను రూ.1 లక్షకు కొనుగోలు చేసిన అభిమాని

  • చిత్తూరులో లక్ష రూపాయలకు అమ్ముడైన 'ఓజీ' మొదటి టికెట్
  • కొనుగోలు చేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని
  • టికెట్ ద్వారా వచ్చిన మొత్తాన్ని జనసేన పార్టీకి విరాళం
  • సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా 'ఓజీ' గ్రాండ్ రిలీజ్
  • సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మాణం 
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఉండే ఉత్సాహం మాటల్లో చెప్పలేనిది. ఆయ‌న‌పై త‌మ అభిమానాన్ని చాటుకోవడానికి వారు ఎప్పుడూ ముందుంటారు. తాజాగా చిత్తూరుకు చెందిన ఓ వీరాభిమాని తన అభిమానాన్ని వినూత్నంగా ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించాడు. పవన్ కల్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఓజీ' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మొదటి టికెట్‌ను ఏకంగా లక్ష రూపాయలు పెట్టి కొనుగోలు చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న థియేటర్ యాజమాన్యం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అభిమాని చెల్లించిన లక్ష రూపాయల మొత్తాన్ని గ్రామాల అభివృద్ధి కోసం వినియోగించేలా జనసేన పార్టీ కార్యాలయానికి విరాళంగా పంపించాలని నిర్ణయించింది. అభిమాని ఉత్సాహాన్ని ఒక మంచి పనికి ఉపయోగించడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కల్యాణ్ సినిమాకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక 'ఓజీ' సినిమా విషయానికొస్తే, ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'సాహో' ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వంలో, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా ఓ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


More Telugu News