హెచ్-1బీ వీసా భారం.. అమెరికా నిర్ణయంతో భారత్‌కు పరోక్ష ప్రయోజనం?

  • హెచ్-1బీ వీసా వార్షిక ఫీజును లక్ష డాలర్లకు పెంచిన అమెరికా
  • సెప్టెంబర్ 21 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధన
  • భారత్‌లో భారీగా విస్తరించనున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు
  • అమెరికన్ కంపెనీలకే తీవ్ర నష్టం అంటున్న నిపుణులు
  • భారత ఐటీ కంపెనీలపై ప్రభావం స్వల్పమేనని అంచనా
  • పరిస్థితిని సమీక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వం, నాస్కామ్
అమెరికా వెళ్లాలనుకునే భారతీయ టెక్కీలకు ఇది కచ్చితంగా చేదువార్తే. హెచ్-1బీ వీసాలపై అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వార్షిక వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు (సుమారు రూ.83 లక్షలు) పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నిబంధన రేప‌టి నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లినప్పటికీ, అనూహ్యంగా ఇది భారత్‌కు మేలు చేస్తుందని టెక్ వర్గాల్లో బలమైన వాదన వినిపిస్తోంది.

అమెరికా తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో ఏర్పడే పరిణామాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ఐటీ పరిశ్రమల సమాఖ్య 'నాస్కామ్' రంగంలోకి దిగాయి. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. అయితే, నిపుణుల అంచనా ప్రకారం, ఈ కొత్త ఫీజుల భారం భారతీయ ఉద్యోగుల కంటే ఎక్కువగా వారిని నియమించుకునే అమెరికన్ కంపెనీలపైనే పడనుంది. నైపుణ్యం కలిగిన భారతీయ టెక్కీలపై అధికంగా ఆధారపడే ఆయా సంస్థలకు ఇది పెద్ద సవాల్‌గా మారనుంది.

ఈ నేపథ్యంలో అమెరికాలో ఏర్పడే టెక్కీల కొరతను అధిగమించేందుకు చాలా గ్లోబల్ కంపెనీలు భారత్ వైపు చూసే అవకాశం ఉంది. తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను (జీసీసీ) ఇండియాలో ఏర్పాటు చేయడం లేదా ఇప్పటికే ఉన్నవాటిని భారీగా విస్తరించడం ద్వారా ఈ సమస్యను అధిగమించాలని భావిస్తున్నాయి. ప్రపంచంలోని జీసీసీలలో దాదాపు సగం మన దేశంలోనే ఉన్నాయని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. 2029-30 నాటికి దేశంలోని జీసీసీల సంఖ్య 1,700 నుంచి 2,100కు పెరుగుతుందని అంచనా.

మరోవైపు, ఈ కొత్త ఫీజుల ప్రభావం భారత ఐటీ కంపెనీలపై పెద్దగా ఉండకపోవచ్చని AIonOS సహ వ్యవస్థాపకుడు సీపీ గుర్నానీ తెలిపారు. "గత కొన్నేళ్లుగా భారతీయ ఐటీ కంపెనీలు హెచ్-1బీ వీసాలపై ఆధారపడటాన్ని 50 శాతం మేర తగ్గించుకున్నాయి. అమెరికాలో స్థానికంగా నియామకాలు చేపట్టడం, ఆటోమేషన్‌పై పెట్టుబడులు పెట్టడం వంటి వ్యూహాల వల్ల ఈ మార్పు సాధ్యమైంది. కాబట్టి ఈ ఫీజుల ప్రభావం మా వ్యాపారాలపై పరిమితంగానే ఉంటుంది" అని ఆయన వివరించారు. మొత్తం మీద, అమెరికా నిర్ణయం భారత టెక్కీలకు ఒక దారిని మూసినా, దేశీయంగా కొత్త ఉద్యోగ అవకాశాలకు మరో దారి తెరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


More Telugu News