అమెరికాకే ప్రాణసంకటం.. వీసా ఫీజు పెంపుపై అమితాబ్ కాంత్

  • భారత్‌కు టర్బోఛార్జ్‌ అన్న నీతి అయోగ్ మాజీ సీఈవో
  • ట్రంప్ నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుందని వ్యాఖ్య
  • హెచ్ 1బీ వీసా ఫీజు పెంపును తప్పుబడుతున్న నిపుణులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయంపై నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ తీవ్రంగా స్పందించారు. హెచ్ 1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ నిర్ణయం వెనక ట్రంప్ ఉద్దేశం ఏదైనప్పటికీ అంతిమంగా భారత్ కే ప్రయోజనం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బహుశా భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని, అయితే అది అమెరికాకే తిప్పికొడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం వల్ల ఏర్పడే పరిణామాలు భారత్‌కు టర్బోఛార్జ్‌లా పనిచేస్తాయని అన్నారు.

అమెరికాలోని కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు దరఖాస్తు చేసే హెచ్ 1బీ వీసాపై ట్రంప్ తాజాగా దృష్టి సారించారు. దేశంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచాలనే ఉద్దేశంతో ఈ వీసా ఫీజును పెంచినట్లు అమెరికా నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణయంతో విదేశీ ఉద్యోగులను నియమించుకునే విషయంలో కంపెనీలు వెనక్కి తగ్గుతాయన్నదే ట్రంప్ ఉద్దేశమని అంటున్నారు. ఫలితంగా అమెరికన్లకు అవకాశాలు పెరుగుతాయని వాదిస్తున్నారు.

అయితే, ట్రంప్ నిర్ణయం అంతిమంగా అమెరికాకే చేటు చేస్తుందని అమితాబ్ కాంత్ తెలిపారు. వీసా ఫీజు పెంపు వల్ల అమెరికాకు వెళ్లే భారత నిపుణుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని వివరించారు. దీని ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై గణనీయంగా ఉంటుందని తెలిపారు. హెచ్ 1బీ వీసా రెన్యూవల్ ఫీజును పెంచడం ద్వారా అమెరికాలోని భారత ఉద్యోగులకు ట్రంప్ ఓ చక్కటి అవకాశం కల్పించారని, మాతృదేశానికి సేవలందించే మార్గం చూపారని ఆయన పేర్కొన్నారు.


More Telugu News