పేర్ని నానితో పాటు 400 మందిపై కేసు నమోదు

  • మచిలీపట్నంలో వైసీపీ ‘చలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ’ ర్యాలీ
  • ర్యాలీకి అనుమతి నిరాకరించిన పోలీసులు
  • అయినా ర్యాలీ చేపట్టిన మాజీ మంత్రి పేర్ని నాని
  • పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ తలపెట్టిన ‘చలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్’ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, పార్టీ శ్రేణులు ముందుకు సాగడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ ఘటనకు సంబంధించి మాజీ మంత్రి పేర్ని నానితో పాటు పలువురు కీలక నేతలు, వందలాది మంది కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళ్తే... మెడికల్ కాలేజీలో ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయని, ఈ సమయంలో ర్యాలీ నిర్వహిస్తే విద్యార్థులతో పాటు సాధారణ ప్రజలకు కూడా ఇబ్బందులు తప్పవని పోలీసులు ముందుగానే స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొంటూ ర్యాలీకి అనుమతిని నిరాకరించారు.

అయితే, పోలీసుల ఆదేశాలను పక్కన పెట్టి, మాజీ మంత్రి పేర్ని నాని నేతృత్వంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా ర్యాలీ నిర్వహించారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు. పేర్ని నాని, పేర్ని కిట్టు, సింహాద్రి రమేష్ బాబు, కైలే అనిల్ కుమార్, ఉప్పాల రాము, దేవాబత్తుల చక్రవర్తి, దేవినేని అవినాశ్ సహా మొత్తం 400 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చినట్లు వెల్లడించారు.

అనుమతి లేకుండా ర్యాలీ చేయడమే కాకుండా, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారి పట్ల దురుసుగా ప్రవర్తించారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఎఫ్ఐఆర్ లో పొందుపరిచినట్లు సమాచారం. ఈ ఘటనతో మచిలీపట్నంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 


More Telugu News