బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశ కాదు.. ఇంజన్ ఆయిల్.. 33 ఏళ్లుగా ఓ వ్యక్తి ఆహారం ఇదే!

  • కర్ణాటకకు చెందిన కుమార్ వింత అలవాటు
  • మూడు దశాబ్దాలుగా ఇంజన్ ఆయిల్ తాగుతున్న వైనం
  • ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా, రోజంతా ఆయిలే ఆహారం
  • రోజుకు 7 నుంచి 8 లీటర్ల ఇంజన్ ఆయిల్ తాగుతున్న వైనం
  •  తన ఆరోగ్యం వెనుక అయ్యప్ప స్వామి దయ అంటున్న కుమార్
ఉదయం నిద్ర లేవగానే టిఫిన్‌లో ఇడ్లీ, దోశ తినడం అందరికీ అలవాటు. కానీ కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఇంజన్ ఆయిల్‌ను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. వినడానికి వింతగా ఉన్నా, గత 33 ఏళ్లుగా ఇదే అతడి దినచర్య. ప్రస్తుతం అతడికి సంబంధించిన ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతోంది.

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాకు చెందిన కుమార్ ఈ వింత అలవాటుతో స్థానికంగా సుపరిచితుడయ్యాడు. వాహనాలకు ఇంజన్ ఆయిల్ మార్చినప్పుడు వచ్చే వేస్ట్ ఆయిల్‌ను సేకరించి దాన్నే ఆహారంగా తీసుకుంటాడు. ఉదయం టీ తాగినట్టుగా ఓ బాటిల్ ఇంజన్ ఆయిల్‌తో తన రోజును ప్రారంభిస్తాడు. రోజంతా కలిపి దాదాపు 7 నుంచి 8 లీటర్ల ఇంజన్ ఆయిల్ తాగుతాడు. దీంతో స్థానికులు అతడిని ముద్దుగా 'ఆయిల్ కుమార్' అని పిలుచుకుంటున్నారు.

ఇంత ప్రమాదకరమైన అలవాటు ఉన్నప్పటికీ, తన ఆరోగ్యానికి ఇప్పటివరకు ఎలాంటి హానీ జరగలేదని కుమార్ చెబుతున్నాడు. మూడు దశాబ్దాలుగా ఒక్కసారి కూడా అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లలేదని అంటున్నాడు. తన ఆరోగ్యానికి అయ్యప్ప స్వామిపై ఉన్న అపారమైన భక్తి, విశ్వాసమే కారణమని ఆయన బలంగా నమ్ముతున్నాడు. ఏడాదిలో దాదాపు ఆరు నెలల పాటు అయ్యప్ప మాల ధరించి దీక్షలో గడుపుతానని కుమార్ తెలిపాడు. ఆయన వింత అలవాటు, ఆయనకున్న విశ్వాసం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


More Telugu News