స్కూబా డైవింగ్ చేస్తూ బాలీవుడ్ సింగర్ జుబీన్ గార్గ్ మృతి

  • సింగపూర్‌లో స్కూబా డైవింగ్ చేస్తుండగా ప్రమాదం
  • సంగీత ప్రదర్శన కోసం సింగపూర్ వెళ్లిన గాయకుడు
  • ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయిన జుబీన్
  • మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు, అస్సామీ సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న జుబీన్ గార్గ్ (52) హఠాన్మరణం చెందారు. సింగపూర్‌లో జరిగిన ఒక దురదృష్టకర ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. ఈ ఘటన సంగీత ప్రియులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

సింగపూర్‌లో జరగనున్న నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు జుబీన్ అక్కడికి వెళ్లారు. ఈ ఫెస్టివల్‌లో భాగంగా సెప్టెంబర్ 20, 21 తేదీల్లో ఆయన సంగీత ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఈ పర్యటనలో భాగంగా సరదాగా స్కూబా డైవింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది ఆయనను సముద్రం నుంచి వెలికితీశారు. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. హుటాహుటిన సింగపూర్ జనరల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో జుబీన్ తుదిశ్వాస విడిచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం జుబీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రిలో ఉంచారు. ఆయన భౌతికకాయాన్ని నేడు లేదా రేపు అసోంకు తీసుకువచ్చే అవకాశముంది. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రంగంలోకి దిగారు. సింగపూర్‌లోని భారత హైకమిషన్‌తో తాము సమన్వయం చేసుకుంటున్నామని, మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన 'ఎక్స్' ద్వారా వెల్లడించారు.


More Telugu News