75 ఏళ్ల వయసులోనూ హుషారుగా... ప్రధాని మోదీ ఆరోగ్య రహస్యం ఇదే!

  • మోదీ ఆరోగ్య రహస్యం వెనుక కఠినమైన ఆహార నియమావళి
  • ఇష్టమైన ఆహారం మునగాకు పరోటా
  • నవరాత్రుల్లో కేవలం వేడినీటితో కఠోర ఉపవాసం
  • చాతుర్మాసంలో నాలుగు నెలల పాటు రోజుకు ఒక్కపూటే భోజనం
  • ఉపవాసం భక్తి, ఆత్మశిక్షణకు ప్రతీక అని వెల్లడి
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకులలో ఒకరిగా, భారత ప్రధానమంత్రిగా నిరంతరం క్షణం తీరిక లేకుండా గడిపే నరేంద్ర మోదీ 75 ఏళ్ల వయసులోనూ అలుపెరగని ఉత్సాహంతో, చురుగ్గా ఎలా ఉండగలుగుతున్నారనేది చాలా మందికి ఆసక్తి కలిగించే విషయం. ఇటీవల తన 75వ పుట్టినరోజు జరుపుకున్న ప్రధాని మోదీ ఫిట్‌నెస్ వెనుక ఉన్న రహస్యం కఠినమైన వ్యాయామాలు కాదు, అత్యంత క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, సంప్రదాయ ఆహారపు అలవాట్లే. వేడినీళ్ల నుంచి మునగాకు పరోటా వరకు ఆయన అనుసరించే ఈ ప్రత్యేక నియమాలే ఆయన ఆరోగ్యానికి మూలమని తెలుస్తోంది.

ఉపవాసం బలహీనపరచదు.. మరింత శక్తినిస్తుంది

తన ఫిట్‌నెస్, ఆహారపు అలవాట్ల గురించి ఇటీవల ప్రముఖ పాడ్‌కాస్ట్ వ్యాఖ్యాత లెక్స్ ఫ్రిడ్‌మన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. "ఉపవాసం ఉన్నప్పుడు నాకెప్పుడూ నీరసం రాలేదు. నేను సాధారణంగా ఎంత పనిచేస్తానో, ఉపవాస సమయంలో కూడా అంతే పనిచేస్తాను. కొన్నిసార్లు ఇంకా ఎక్కువ కూడా చేస్తాను. ఆ సమయంలో నా ఆలోచనలు మరింత స్పష్టంగా, ప్రవాహంలా వస్తుంటాయి. అది ఒక అద్భుతమైన అనుభూతి. నాకు ఉపవాసం అంటే కేవలం ఆహారం మానడం కాదు, అది ఒక భక్తి, ఒక ఆత్మశిక్షణ" అని మోదీ వివరించారు. ఈ నియమం తన పని సామర్థ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని ఆయన పునరుద్ఘాటించారు.

చాతుర్మాసంలో రోజుకు ఒక్కపూట భోజనం

భారతీయ సంప్రదాయాలను నిష్టగా పాటించే ప్రధాని మోదీ, చాతుర్మాస దీక్షను చాలా సంవత్సరాలుగా అనుసరిస్తున్నారు. జూన్ మధ్య నుంచి నవంబర్ మధ్య వరకు ఉండే ఈ నాలుగు నెలల కాలంలో తాను 24 గంటల్లో కేవలం ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తానని అదే ఇంటర్వ్యూలో తెలిపారు. "సుమారు నాలుగు నుంచి నాలుగున్నర నెలల పాటు, నేను రోజుకు ఒక్కపూట మాత్రమే ఆహారం తీసుకునే సంప్రదాయాన్ని పాటిస్తాను" అని ఆయన చెప్పారు. ఈ కాలంలో ఆయన ఆహార నియమావళి, జీవనశైలి పూర్తిగా చాతుర్మాస దీక్షకు అనుగుణంగా ఉంటాయి. ఈ సంప్రదాయం శరీరానికి విశ్రాంతినిచ్చి, జీర్ణవ్యవస్థను శుభ్రపరచి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఆయన గట్టిగా నమ్ముతారు.

ఆరోగ్య రహస్యాల్లో వేడినీళ్లు, మునగాకు పరాటా

ప్రధాని మోదీ ఆరోగ్య రహస్యాలలో మరొక ముఖ్యమైన అంశం వేడినీళ్లు తాగడం. ముఖ్యంగా శారదీయ నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజుల పాటు కేవలం వేడినీళ్లు మాత్రమే తాగి కఠిన ఉపవాసం పాటిస్తానని ఆయన తెలిపారు. "వేడినీళ్లు తాగడం నా దినచర్యలో ఎప్పుడూ ఒక భాగమే. నా జీవనశైలి మొదటి నుంచి అలానే అలవడింది" అని పేర్కొన్నారు. వేడినీళ్లు తాగడం వల్ల శరీరంలో చెమట, మూత్ర విసర్జన ప్రక్రియలు సక్రమంగా జరిగి, విష పదార్థాలు (టాక్సిన్స్) బయటకు వెళ్లిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు. ఈ అలవాటు శరీరాన్ని తేలికగా, తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఇక ఆయన ఆహారంలో అత్యంత ఇష్టమైన, తరచూ తినే పదార్థం మునగాకు పరోటా. ఓ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. మునగాకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్లు, ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి శరీరాన్ని కాపాడతాయి. అంతేకాకుండా, కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి. పొటాషియం, ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, మలబద్ధకాన్ని నివారిస్తాయి. మునగాకు జ్ఞాపకశక్తిని పెంచి, ఒత్తిడిని తగ్గించడంలోనూ తోడ్పడుతుంది.

వీటితో పాటు, రోగనిరోధక శక్తిని పెంచే కషాయం (కడా) వంటి పారంపరిక పానీయాలను, వేపాకులు, మిశ్రి వంటి సహజ ఔషధాలను కూడా తన ఆహారంలో చేర్చుకుంటానని మోదీ తెలిపారు. ఈ సంప్రదాయ, క్రమశిక్షణతో కూడిన జీవనశైలే 75 ఏళ్ల వయసులో కూడా దేశ పరిపాలనలో ఆయనను ఇంత ఉత్సాహంగా, చురుగ్గా ఉంచుతోందని స్పష్టమవుతోంది.


More Telugu News