ఉగ్రవాదితో నా భేటీకి నాటి ప్రధాని మన్మోహన్ ప్రశంసలు.. కోర్టులో యాసిన్ మాలిక్ వాంగ్మూలం

  • భారత నిఘా వర్గాల కోరిక మేరకే ఆ భేటీ జరిగిందని వెల్లడి
  • ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కశ్మీరీ ఉగ్రవాది
  • 2006లో పాక్‌తో శాంతి చర్చల్లో భాగంగానే ఈ ఘటన అని పేర్కొన్న మాలిక్
  • జాతీయ భద్రతా సలహాదారు సమక్షంలో ప్రధానితో సమావేశమయ్యానని వెల్లడి
  • తనను అహింసా ఉద్యమ పితామహుడిగా మన్మోహన్ అభివర్ణించారన్న మాలిక్
టెర్రర్ ఫండింగ్ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) ఉగ్రవాది యాసిన్ మాలిక్.. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 2006లో తాను పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను కలిసిన తర్వాత స్వయంగా మన్మోహన్ సింగ్ తనకు కృతజ్ఞతలు తెలిపారని మాలిక్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆగస్టు 25న ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన ఒక అఫిడవిట్‌లో ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

హఫీజ్ సయీద్‌తో తన భేటీ వ్యక్తిగత నిర్ణయం కాదని, పాకిస్థాన్‌తో తెరవెనుక శాంతి చర్చల్లో భాగంగా భారత నిఘా వర్గాల ఉన్నతాధికారుల కోరిక మేరకే అది జరిగిందని మాలిక్ తన అఫిడవిట్‌లో తెలిపారు. 2005లో కశ్మీర్‌లో భూకంపం వచ్చిన తర్వాత తాను పాకిస్థాన్ పర్యటనకు వెళ్లే ముందు అప్పటి ఐబీ స్పెషల్ డైరెక్టర్ వి.కె. జోషి తనను ఢిల్లీలో కలిశారని పేర్కొన్నారు. పాక్‌లోని రాజకీయ నాయకులతో పాటు, హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాద నాయకులతో కూడా మాట్లాడి శాంతి ప్రక్రియకు సహకరించాలని జోషి తనను కోరినట్లు తెలిపారు.

ఆయన కోరిక మేరకే తాను పాకిస్థాన్‌లో హఫీజ్ సయీద్‌తో పాటు యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ నాయకులను కలిశానని, హింసను వీడి శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని వారికి సూచించానని మాలిక్ వివరించారు. పాకిస్థాన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే జాతీయ భద్రతా సలహాదారు ఎం.కె. నారాయణన్ సమక్షంలో తాను ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిశానని తెలిపారు. తన ప్రయత్నాలకు ప్రధాని ప్రశంసించారని, ఓపికకు, నిబద్ధతకు కృతజ్ఞతలు చెప్పారని ఆరోపించారు.

అంతేకాకుండా, మన్మోహన్ సింగ్ తనను "కశ్మీర్‌లో అహింసా ఉద్యమ పితామహుడిగా" అభివర్ణించారని కూడా మాలిక్ పేర్కొన్నారు. తన అఫిడవిట్‌లో వాజ్‌పేయి, సోనియా గాంధీ, చిదంబరం వంటి పలువురు అగ్ర నాయకులతో గతంలో జరిగిన సమావేశాల గురించి కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం యాసిన్ మాలిక్ చేసిన ఈ ఆరోపణలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసే అవకాశం ఉంది.


More Telugu News