మరో వివాదంలో సురేశ్ గోపి.. బాధితురాలితో దురుసు ప్రవర్తన

  • సహాయం కోరిన వృద్ధురాలిపై సురేశ్ గోపి కటువు సమాధానం 
  • కరువన్నూర్ బ్యాంకు స్కాం బాధితురాలి ఆవేదన
  • 'వెళ్లి మీ ముఖ్యమంత్రికే చెప్పుకో' అంటూ దురుసుగా వ్యాఖ్య
కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి, ప్రముఖ నటుడు సురేశ్ గోపి మరోసారి తన ప్రవర్తనతో వివాదంలో చిక్కుకున్నారు. తన సొంత నియోజకవర్గమైన త్రిశ్శూర్‌లో పర్యటిస్తున్న సమయంలో, సహాయం కోరి వచ్చిన ఓ వృద్ధురాలిపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం విమర్శలకు దారితీసింది. "వెళ్లి మీ ముఖ్యమంత్రికే చెప్పుకో" అంటూ ఆమెతో దురుసుగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే, కేరళలో తీవ్ర సంచలనం సృష్టించిన కరువన్నూర్ సహకార బ్యాంకు కుంభకోణంలో ఎంతోమంది డిపాజిటర్లు తమ డబ్బును కోల్పోయారు. ఈ స్కాంలో బాధితురాలైన ఆనందవల్లి అనే మహిళ, బుధవారం త్రిశ్శూర్‌లో పర్యటిస్తున్న సురేశ్ గోపిని కలిశారు. బ్యాంకులో చిక్కుకుపోయిన తన డిపాజిట్లను తిరిగి ఇప్పించడంలో సహాయం చేయాలని ఆమె మంత్రిని అభ్యర్థించారు.

ఆమె అభ్యర్థనపై స్పందించిన సురేశ్ గోపి, "వెళ్లి మీ మంత్రికో, ముఖ్యమంత్రికో చెప్పు. ఎక్కువగా మాట్లాడొద్దు" అంటూ కటువుగా సమాధానమిచ్చారు. దీంతో ఆశ్చర్యపోయిన ఆనందవల్లి, "మీరు కూడా మా మంత్రే కదా" అని అనగా, "నేను దేశానికి మంత్రిని" అని ఆయన బదులిచ్చారు. ఈ సంభాషణతో ఆ మహిళ తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఈ ఘటన అనంతరం ఆనందవల్లి మీడియాతో మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో తమ డిపాజిట్లను తిరిగి ఇప్పిస్తానని సురేశ్ గోపి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. "మంత్రి గారు అంత కఠినంగా మాట్లాడకుండా, నా విజ్ఞప్తిని పరిశీలిస్తానని చెప్పినా సరిపోయేది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

కాగా, సీపీఎం నేతల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలున్న ఈ బ్యాంకు కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇంటి నిర్మాణం కోసం వచ్చిన ఓ వృద్ధుడి దరఖాస్తును తిరస్కరించి సురేశ్ గోపి విమర్శల పాలైన విషయం తెలిసిందే. 


More Telugu News