అమెరికాలో ప్రమాదవశాత్తు తెలంగాణ వాసి మృతి

  • 2016లో అమెరికా వెళ్లిన మహబూబ్ నగర్ పట్టణవాసి అమీరుద్దీన్
  • స్నేహితుల మధ్య గొడవ జరగగా కాల్పులు జరిపిన పోలీసులు
  • ప్రమాదవశాత్తు ఒక తుటా తగలడంతో ప్రాణాలు కోల్పోయిన అమీరుద్దీన్
అమెరికాలో మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన అమీరుద్దీన్ 2016లో అమెరికా వెళ్ళాడు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఎంఎస్ పూర్తి చేసి, అక్కడే ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఉద్యోగ ఒప్పందం ముగిసింది. గడువు పొడిగించకపోవడంతో స్నేహితులతో కలిసి ఒక గదిలో ఉంటున్నాడు.

ఈ క్రమంలో ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ జరగగా, వారిలో ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్నేహితుల మధ్య వివాదం సద్దుమణగకపోవడంతో కాల్పులు జరిపారు. దురదృష్టవశాత్తు ఒక బుల్లెట్ అమీరుద్దీన్‌కు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. చికాగోలో ఉంటున్న మృతుడి మామయ్య ఘటనాస్థలానికి వెళ్ళారు. అతను మృతి చెందిన విషయాన్ని స్నేహితులు తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు కన్నీరుమున్నీరవుతున్నారు.


More Telugu News