పుతిన్ బర్త్‌డే విషెస్.. ఉక్రెయిన్ శాంతిపై మోదీ కీలక వ్యాఖ్యలు

  • ప్రధాని మోదీకి ఫోన్‌లో పుతిన్ పుట్టినరోజు శుభాకాంక్షలు
  • తమది స్నేహపూర్వక బంధమని పేర్కొన్న రష్యా అధ్యక్షుడు
  • మోదీ నాయకత్వ పటిమపై పుతిన్ ప్రశంసల వర్షం
  • ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి సిద్ధమన్న ప్రధాని మోదీ
  • ఇరు దేశాల వ్యూహాత్మక బంధాన్ని మరింత బలోపేతం చేస్తామని స్పష్టీకరణ
ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు భారత్ అన్ని విధాలా సహకరించడానికి సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. తన 75వ పుట్టినరోజు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

బుధవారం ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ, "ప్రభుత్వాధినేతగా మీ పనితీరు దేశ ప్రజల నుంచి మీకు గొప్ప గౌరవాన్ని, అంతర్జాతీయ వేదికపై అపారమైన కీర్తిని తెచ్చిపెట్టింది. మీ నాయకత్వంలో భారత్ సామాజిక, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించింది" అని ప్రశంసించారు. ఇరు దేశాల మధ్య ఉన్న విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మోదీ వ్యక్తిగతంగా ఎంతో కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు.

పుతిన్ ఫోన్ కాల్‌పై మోదీ 'ఎక్స్' వేదికగా స్పందించారు. "నా మిత్రుడు, అధ్యక్షుడు పుతిన్‌కు ధన్యవాదాలు. మీ ఫోన్ కాల్, పుట్టినరోజు శుభాకాంక్షలకు కృతజ్ఞతలు. ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం సాధ్యమైన అన్ని రకాలుగా సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉంది" అని తన పోస్టులో పేర్కొన్నారు.

ఇటీవల చైనాలోని టియాంజిన్‌లో జరిగిన ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా మోదీ, పుతిన్ సమావేశమైన విషయం తెలిసిందే. ఆ భేటీలో కూడా ఉక్రెయిన్ అంశంపై చర్చించారు. యుద్ధానికి త్వరగా ముగింపు పలికి, శాశ్వత శాంతి పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని మోదీ నొక్కిచెప్పారు. ఈ ఏడాది చివరలో భారత్‌లో జరగనున్న 23వ వార్షిక సదస్సుకు హాజరుకావాల్సిందిగా పుతిన్‌ను మోదీ ఆహ్వానించారు.


More Telugu News